కొవిడ్ తర్వాత ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. దీనికి తోడు.. ఈ ఏడాది పాఠశాలల విలీనంలో భాగంగా సమీపంలోని ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు.. ఉన్నత పాఠశాలల్లో చేర్చారు. ఈ పిల్లలందరికీ సబ్జెక్ట్ టీచర్లే బోధించాల్సి ఉండటం వల్ల.. గురువుల కొరత భారీగా కనిపిస్తోంది. విద్యార్థుల సంఖ్యకు తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల.. ఒకే గదిలో ఎక్కువ మంది విద్యార్థులకు బోధించాల్సి వస్తోంది.
ఈ క్రమంలో వెనక కూర్చున్న విద్యార్థులకు టీచర్లు చెప్పే పాఠాలు వినిపించని పరిస్థితి. పిల్లలూ ఏకాగ్రత కోల్పోతున్నారు. అయితే భోదనలో ఈ లోటు కనిపించకుండా విశాఖ జిల్లా అనకాపల్లి మండలం మామిడిపాలెం.. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సాంకేతికతను అందిపుచ్చుకొని ముందుకువెళ్తున్నారు. తరగతి గదిలో ఎంత మంది కూర్చున్నా పాఠం స్పష్టంగా వినపడేలా మైక్రో స్పీకర్లతో బోధన చేస్తున్నారు.
మామిడిపాలెం పాఠశాలలో 600 మందికిపైగా విద్యార్థులున్నారు. ఇక్కడ గణితం బోధించేందుకు ముగ్గురు టీచర్లు ఉండాలి. కానీ ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. వందల సంఖ్యలో విద్యార్థులకు ఒక్క టీచరే బోధించాలంటే గొంతు పెగిలేలా అరిచినా పిల్లల చెవికి పాఠాలు ఎక్కే పరిస్థితి లేదు. మిగతా సబ్జెక్టుల్లోనూ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇలాంటి కష్టాలే ఎదుర్కొంటున్నారు. రెండు మూడు సెక్షన్ల విద్యార్థులను ఒకే గదిలో పెట్టి బోధించాల్సి వచ్చినప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అందుకే గురువులంతా స్మార్ట్ బోధనవైపు మొగ్గుచూపారు.
మైక్రోస్పీకర్లను ఉపయోగించి బోధన చేయడం వల్ల తమకు పాఠాలు స్పష్టంగా వినిపిస్తున్నాయని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతికను ఉపయోగించుకుని బోధన చేయడం శుభపరిణామమని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశంసిస్తున్నారు.
ఇదీ చదవండి