Smart City Projects Andhra Pradesh: కాకినాడలో గత తెలుగుదేశం ప్రభుత్వం స్మార్ట్‌సిటీ కింద కళాక్షేత్రం నిర్మించతలపెట్టారు. చివరి దశదాకా వచ్చిన పనులు జగన్ అధికారంలోకి వచ్చాక అక్కడే ఆగిపోయాయి. 15 కోట్ల రూపాయల అంచనాతో చేపట్టిన సైన్స్ సిటీ పనులూ అసంపూర్ణమే. గతంలోనే పనులు 80 శాతం పూర్తయ్యాయి. 11 కోట్ల వరకూ బిల్లులు బకాయిలు పెట్టారంటూ గుత్తేదారు వదిలేసి వెళ్లిపోయారు.
ఇంకో 2 కోట్లు వెచ్చిస్తే సైన్స్ సిటీ అందుబాటులోకి వస్తుంది. ఇవే కాదు కాకినాడ స్మార్ట్‌సిటీ (Kakinada Smart City) ప్రాజెక్టులో చేపట్టిన పనులు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక పడకేశాయి. కాకినాడకు మూడోనేత్రంగా తెచ్చిన సీసీటీవీ ప్రాజెక్టైతే నిర్వహణకు డబ్బు వెచ్చించలేక మూసేశారు. కాకినాడలో దాదాపు 19 వందల 10కోట్ల రూపాయల అంచనాలతో 94 పనులు గత ప్రభుత్వం ప్రారంభించగా ఇప్పడవన్నీ అసంపూర్తిగా వెక్కిరిస్తున్నాయి. కనీసం 80 శాతం పూర్తైన పనుల్నీ పక్కనపెట్టడం వైఎస్సార్సీపీ విధ్వంస వైఖరికి నిదర్శనం.
బలైన అమరావతి స్మార్ట్‌సిటీ: జగన్ అక్కసుకు అడ్డంగా బలైంది అమరావతి స్మార్ట్‌సిటీ! (Amaravati Smart City) రాజధానినే ఆగం చేసిన జగన్ సర్కారు, ఆ పేరుతో చేపట్టిన స్మార్ట్ సిటీనీ ఇలా అరణ్యంలా మార్చింది. దానికి నిదర్శనమే ముళ్లకంపలపాల పాలైన ఈ పైపులు! రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్‌గా ఇవ్వాల్సిన నిధులను ఆపేయడంతో కోట్ల విలువైన సామగ్రి ఎండకు ఎండి, వానకు తడిసి పాడైపోతున్నాయి. విద్యుత్తు, టెలికాం, ఇతరత్రా కేబుళ్లు భూగర్భంలో నుంచి వెళ్లేలా 270 కోట్ల రూపాయలతో డెక్ట్ పనులు ప్రారంభిస్తే అవీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.
ఇక 75 కోట్ల రూపాయలతో తుళ్లూరులో నైపుణ్యాభివృద్ధి కేందం నిర్మిస్తే దాన్ని సీఆర్డీఏ (Capital Region Development Authority) పరిపాలనా అవసరాలకు వినియోగిస్తున్నారు. 19 కోట్ల రూపాయలతో స్మార్ట్ వార్డు డెవలప్‌మెంట్ పనులు ప్రారంభిస్తే.. వాటినీ పక్కన పెట్టేశారు. స్మార్ట్ వార్డుల అభివృద్ధి, ఘనవ్యర్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి కేంద్రం, పట్టణ క్రీడా కేంద్రాల ప్రాజెక్టుల్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దుచేసింది. పాఠశాలలు, ఈ-ఆరోగ్య కేంద్రాలు, నీటి శుద్ధి కేంద్రం ప్రాజెక్టుల్ని కుదించింది. అమరావతి సమీకృత కమాండ్ కంట్రోల్ కేంద్రం వ్యయాన్ని 86 కోట్ల నుంచి 37 కోట్లకు తగ్గించింది.
58 కోట్ల రూపాయల్ని సిటీ ఇన్వెస్ట్‌మెంట్ టూ ఇన్నోవేటివ్, ఇంటిగ్రేటెడ్ అండ్ సస్టెయిన్ కార్యక్రమానికి కేటాయించింది. కాగా ఇప్పుడు ఆ నిధుల్నే సెంటు ఇళ్ల స్థలాలు కేటాయించిన ప్రాంతాల్లో పాఠశాలలు, ఈ-ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి మళ్లించనున్నారు. అక్కడ స్థలాలపై లబ్ధిదారులకు ఇంకా హక్కులే రాలేదు. అలాంటి ప్రాంతంలో పనులు చేస్తామనడం, అదీ కేంద్రం అనుమతి తీసుకోకపోవడం, అమరావతితో ఆటలాడుకోవడమేననే విమర్శలున్నాయి. అమరావతి స్మార్ట్ సిటీకి కేంద్రం 500 కోట్లు ఇవ్వగా, ఈ నిధుల్నీ 2022 మార్చి 31లోగా సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలో జమ చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయకుండా అందులో 150కోట్లు ఇతర కార్యక్రమాలకు మళ్లించింది.
Smart Cities Works in AP: ఏ అభివృద్ధైనా సరే.. మాట ఇచ్చాడా..మడమ తిప్పినట్లే..!
తిరుపతి స్మార్ట్ సిటీ (Tirupati Smart City) పరిస్థితీ అంతే! అత్యంత కీలకమైన ప్రాజెక్టుల్లో ఒకటైన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌పైకి వాహనాల్ని అనుమతిస్తున్నా ఇంకా 10 శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వర్షం కురిస్తే వంతెనపైనుంచి సర్వీస్ రోడ్లపై నీరు కారుతోందని వాహనదారులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. గొల్లగానిగుంటలో 2 కోట్ల రూపాయలతో చేపట్టిన క్రికెట్ స్టేడియం, గ్యాలరీ పనులు పడకేశాయి. వినాయకసాగర్‌లో కోటీ 99 లక్షలతో జిమ్, ఫన్ జోన్ పనులు ప్రారంభించినా నత్తనడకన సాగుతున్నాయి. 50 కోట్లతో రైల్వే స్టేషన్ ఎదురుగా ప్రారంభించిన మల్టీలెవల్ కారు పార్కింగ్ పనుల్లోనూ పురోగతి లేదు. కొన్నైతే పిల్లర్ల దశలో ఆగిపోతే, మరికొన్ని మొండిగోడల్లా వెక్కిరిస్తున్నాయి.
విశాఖ స్మార్ట్ సిటీ (Visakhapatnam Smart City)లో భాగంగా చేపట్టిన భూగర్భ మురుగునీటి పనులు నత్తకే నడక నేర్పుతున్నాయి. పెందుర్తిలో 300 కోట్లు, గాజువాకలో 400 కోట్ల రూపాయల అంచనాలతో పనులు ప్రారంభించారు. గాజువాకలో 45 శాతం పనలు పూర్తవగా, నిధులు లేవని మిగతా పనులు తాత్కాలికంగా నిలిపివేశారు. పెందుర్తిలో పనులు పూర్తైనా ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వడంలో తాత్సారం చేస్తున్నారు.
ఇతర రాష్ట్రాలు అభివృద్ధి చేసుకుంటుంటే: అమరావతి, విశాఖ, కాకినాడ, తిరుపతి స్మార్ట్ సిటీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 2 వేల కోట్ల రూపాయలు సమకూర్చాలన్నది ఒప్పందం. కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద దశల వారీగా ఇప్పటివరకూ 19 వందల 7 కోట్లు విడుదల చేసింది. దీంతో నాలుగున్నరేళ్ల క్రితం వరకూ స్మార్ట్‌సిటీ పనులు జోరుగా సాగాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక వాటి లక్ష్యాన్నే దెబ్బ తీసింది. అనేక రాష్ట్రాలు కేంద్రం సాయంతో స్మార్ట్‌సిటీల్ని అభివృద్ధి చేసుకుంటుంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.
తెలుగుదేశం హయాంలో రాష్ట్ర వాటా కింద 800 కోట్లు కేటాయించగా, వైఎస్సార్సీపీ సర్కార్ ఈ నాలుగున్నరేళ్లలో 286 కోట్లు విదిల్చింది. పైగా కేంద్రం ఇచ్చిన నిధులనూ స్మార్ట్ సిటీలకు కాకుండా ప్రభుత్వ అవసరాలకు వాడుకుంది. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్రం స్మార్ట్‌సిటీల వారీగా సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలు తెరిచి, అందులోనే నిధులు ఉంచాలని తేల్చిచెప్పింది. అలా ఈ ఏడాది మేలో 812 కోట్ల రూపాయల కేంద్రం నిధులను స్మార్ట్‌సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం పీడీ ఖాతాల నుంచి బదిలీ చేసింది. నిధులైతే ఇప్పటికీ ఎస్ఎన్ఏ ఖాతాల్లోకి చేరలేదు. రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఇవ్వాల్సిన 814 కోట్ల రూపాయలకూ అతీగతీ లేదు
జగనన్నా ఇదేనా నీ చిత్తశుద్ధి - ఎన్నికల ముందు విశాఖ మెట్రో అంటూ ఎందుకీ హడావుడి?