సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో క్షీరాబ్ది ద్వాదశి ఉత్సవం (చిల్కు ద్వాదశి) మంగళవారం సాయంత్రం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఏటా కార్తిక శుద్ధ ద్వాదశిని పురస్కరించుకుని సింహాచలేశుని సన్నిధిలో దీన్ని విశేషంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆలయ ఆస్థాన మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజ స్వామి, ఆళ్వారులు, శయన పెరుమాళ్లను అధిష్ఠింపజేశారు. అర్చకులు విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం పూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమలతో అలంకరించిన రోలు, రోకళ్లు, చెరకు గడలను స్వామి ఎదుట ఉంచి ఆవాహన, ఆరాధన నిర్వహించారు. అనంతరం రోటిలో బెల్లం, పాలు, నువ్వులు వేసి తొలుత చెరకు గడలతో, అనంతరం రోకళ్లతో దంచి చిమ్మిలి తయారు చేశారు. వేడుక జరుగుతుండగా పురోహితులు వేద పఠనం, కీర్తన భాగవతులు సంకీర్తనలు ఆలపించారు. దంచిన చిమ్మిలిని స్వామికి నివేదించి భక్తులకు వితరణ చేశారు. అనంతరం ఆలయ బేడామండపంలో శయన పెరుమాళ్ల తిరువీధి ఉత్సవం వైభవంగా జరిగింది.
పూజా ద్రవ్యాలు సమర్పించిన ఆడారి కుటుంబీకులు
చిల్కు ద్వాదశిని పురస్కరించుకుని అనకాపల్లి ప్రాంతానికి చెందిన ఆడారి కుటుంబీకులు అప్పన్న స్వామికి పూజా ద్రవ్యాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ క్రమంలో సింహగిరిపై జరిగిన ఉత్సవంలో ఆ కుటుంబ పెద్ద వరాహ సత్య నాగభూషణరావు ఆధ్వర్యంలో స్వామికి బెల్లం, చెరకు గడలు, నువ్వులు, తదితర పూజా సామగ్రి సమర్పించారు.
ఇదీ చదవండి: Tirumala : శ్రీవారికి వైభవంగా.. "కైశిక ద్వాదశి ఆస్థానం"