విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో మైనర్ శారదా నది వంతెనపై నుంచి.. వరద పొంగి ప్రవహిస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత నది ఈ స్థాయిలో ఉగ్రరూపం దాల్చి ప్రవహించడంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాంబిల్లి మండలం నారాయణపురం సమీపంలో మైనర్ శారదానది వంతెనపై నుంచి నీరు వెళ్తోంది. ఎలమంచిలి, గాజువాక ప్రధాన రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. రెండు వైపులా పోలీసులు కాపలాగా ఉండి వాహనాలను నిలిపేస్తున్నారు.
స్టీల్ ప్లాంట్ దారి బంద్
ఒక పక్క ప్రత్యేక ఆర్థిక మండలి మరో పక్క విశాఖ స్టీల్ ప్లాంట్ వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం కాగా.. ఈ దారిలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా భారీ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
5 అడుగుల మేర..
వంతెనపై నుంచి 5 అడుగుల ఎత్తులో వరద నీరు ప్రవహిస్తోంది. వరద నీరు తగ్గేవరకు ఈ మార్గంలో రాకపోకలు నిలిపివేస్తున్నామని పోలీసులు ప్రకటించారు. భారీ వరదకు నది పరివాహక ప్రాంత గ్రామాలు జలమయమయ్యాయి. రైవాడ రిజర్వాయర్ గేట్లు ఎత్తివేయడంతో నదిలో నీటి ఉద్ధృతి మరింత పెరుగుతోంది. ఈ ప్రాంతంలో పంట పొలాలు నీట మునిగాయి. రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.