విశాఖలో ఇప్పుడు దొంగలముఠాలు దర్శనమిస్తున్నాయి. దారిదోపిడీలకు పాల్పడుతూ ..ప్రజలను బెదిరిస్తూ అందినకాడికి నగదును లాక్కుంటున్నారు. అడ్డుగా వెళ్తే..వారిని బెదిరించి దాడులకు పాల్పడుతున్నారు. తెల్లవారితే చాలు సాగర తీరంలో ఆహ్లాదంగా కాలినడకన వెళ్లే వారు..ఇప్పుడు భయపడుతున్నారు. ఐదారు రోజులుగా నాలుగు స్టేషన్ల పరిధిలో వరుస కేసులు నమోదయ్యాయి. లారీ డ్రైవర్లను బెదిరించి డబ్బులు తీసుకోవడం, ఒంటరిగా రహదారిపై వెళుతున్న ద్విచక్రవాహన దారులను బెదిరించి సెల్ఫోన్లను లాక్కోవడం... బీచ్ రోడ్డులో వాకింగ్ చేసే వారిపైనా దౌర్జన్యం చేయడం... వారందరి అంతిమలక్ష్యం. కనిపించిన ప్రతి ఒక్కరిని బెదిరించి వారి దగ్గరనుంచి నగదును దోచేస్తున్నారు.
బ్లేడ్ మింగేశాడు..
కల్లు పాకలు ప్రాంతానికి చెందిన ఈర్ల వినయ్ కుమార్‌తో పాటు.. మరో ఇద్దరు నిందితులు మాదక ద్రవ్యాలు, గంజాయికి బానిసలై దారిదోపిడి చేస్తున్నారు. బీచ్ రోడ్డులో మార్నింగ్ వాక్ చేస్తున్న ఓ మహిళకు కత్తి చూపించి చంపేస్తామని ముగ్గురు బెదిరించి. ఆమె నుంచి సెల్‌ఫోన్ లాక్కుని దాని పాస్‌వర్డ్‌ను బలవంతంగా తెలుసుకున్నారు. ఆమెపై దాడి చేశారు. ఇందులో ప్రధాన నిందితుడు ఈర్ల వినయ్ కుమార్ పోలీసుల అరెస్టు సమయంలో సర్జికల్ బ్లేడ్‌ను మింగేశాడు.వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆసుపత్రికి తరలించి ఆ బ్లేడ్ ను బయటకు తీయించారు. ఈర్ల వినయ్ కుమార్ పై రౌడీషీట్ సైతం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దోపిడీ, స్నాచింగ్,దొంగతనాలు, హత్యాయత్నాలు వంటి కేసులతో పాటు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అతనిపై కేసులు నమోదయ్యాయి.
రాడ్లతో బెదిరిస్తారు..!
గత నెల 30వ తేదీ నుంచి వివిధ సమయాల్లో డోలా సాయితో పాటు మరో ఐదుగురు నిందితులు దొంగతనాలు చేశారు. ఒంటరిగా ద్విచక్ర వాహనాలపై వెళుతున్న వ్యక్తులను బెదిరించి వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లను,శిరస్త్రాణాలను లాక్కున్నారు. రాత్రి సమయాల్లో ఆగి ఉన్న లారీల వద్దకు వెళ్లి ఇనుప రాడ్లుచూపించి డ్రైవర్లను బెదిరించి నిందితులు దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇవి రెండూ వేర్వేరు ముఠాలని పోలీసులు చెబుతున్నారు. పీఎం పాలెం, భీమిలి, వన్ టౌన్, ఫోర్ టౌన్ పోలీసు స్టేషన్ల పరిధిలో దోపిడీలు, దొంగతనాలకు పాల్పడ్డారు. వీరందరినీ పోలీసులు అరెస్టు చేశారు.
పదిమంది అరెస్ట్..
ప్రశాంత నగరంగా ఉన్న విశాఖలో వాతావరణానికి ఇబ్బంది కలిగించే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు ఉంటాయని సీపీ మనీష్ కుమార్ సిన్హా స్పష్టంచేశారు. ఎట్టి పరిస్థితుల్లోను నేరానికి పాల్పడిన వారు తప్పించుకునే అవకాశం ఉండదని హెచ్చరించారు. ఈ కేసుల్లో మొత్తం పది మందిని అరెస్టు చేయగా అందులో ఇద్దరు మైనర్ నేరగాళ్లు ఉన్నారు. వారి నుంచి ఒక బుల్లెట్ సహా మూడు ద్విచక్ర వాహనాలు, 8 సెల్ ఫోన్లు, ఒక కత్తి, ఒక హెల్మెట్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి.