విశాఖలో పోలీసులు నిఘా పెట్టి దొంగల ఆట కట్టించారు. డీసీపీ (క్రైమ్) సురేష్‌బాబు ఏడీసీపీ వేణుగోపాలనాయుడు, ఏసీపీ పెంటారావు, సీఐలు సింహాద్రినాయుడు, అవతారంతో కలసి వివరాలు వెల్లడించారు.
విఘ్నేశ్వరుడి ఆభరణాల దొంగలు దొరికారు
ఆగస్టు 20 తెల్లవారుజామున సాలిగ్రామపురంలోని త్రిమూర్తిక విఘ్నేశ్వరస్వామి ఆలయంలో దొంగతనం జరిగిందని, సుమారు 2.4 కిలోల వెండి ఆభరణాలు, 3 గ్రాముల బంగారు ఆభరణాలు మాయమయ్యాయని పోలీసులకు ఫిర్యాదు అందింది. పాత డెయిరీ ఫారానికి చెందిన కె.జగదీష్‌బాబు, కె.దుర్గాప్రసాద్, ఓ మైనర్ పాత్ర దొంగతనంలో ఉన్నట్లు గుర్తించారు. ఒక ద్విచక్రవాహనాన్ని దొంగిలించి దానిపై వెళ్లి.. సాలిగ్రామపురం దేవాలయంలో తెల్లవారుజామున ఆలయం తాళాలు బద్దలు కొట్టి, ఆలయంలో ఉన్న వెండి, బంగారు ఆభరణాలను దొంగలించారు. వీరు అక్కయ్యపాలెం దాలిరాజు సూపర్ మార్కెట్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని, వారి నుంచి ఆభరణాలు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. జగదీష్‌బాబు, దుర్గాప్రసాద్‌లపై గతంలో ఎలాంటి కేసులు లేవు. వీరిని అరెస్టు చేశారు.
సిలిండర్లు మాయం
ఆగస్టు 28న రామ్‌నగర్‌లోని అపార్టుమెంట్‌లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గ్యాస్ సిలిండర్, రూ.8వేలు నగదు మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. గోపాలపట్నం, స్టీల్‌ప్లాంట్ స్టేషన్ల పరిధిలోనూ గ్యాస్ సిలిండర్లు దొంగతనం జరిగినట్లుగా గుర్తించారు. అనధికారికంగా సిలిండర్లను విక్రయించేందుకు సిద్ధమవుతున్న వ్యక్తుల గురించి పోలీసులు ఆరా తీశారు. సమాచారం అందుకుని దొంగతనానికి పాల్పడింది సికింద్రాబాద్‌కు చెందిన పి.కృష్ణారెడ్డి(51)గా గుర్తించారు. అతన్ని అరెస్టు చేసి, మూడు సిలిండర్లు, దొంగలించిన ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
హనుమాన్ ఆలయాలే లక్ష్యంగా
పెదగంట్యాడ దరి గంగవరం గ్రామంలో రాజేశ్వరరావు అనే వ్యక్తి తన ఇంటి ముందు నిద్రపోతుండగా.. మెడలో నుంచి గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు తీసుకుని పారిపోయారు. గంగవరం ప్రాంతానికి చెందిన చేపల ఆనంద్‌కు గతంలో నేరాలతో సంబంధం ఉండటంతో అతనిపై నిఘా ఉంచారు. ఆనంద్, కె.దేముడు, బి.లక్ష్మణరావులతో కలిసి తిరుగుతున్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. గొలుసు దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నారు. వీరు గొలుసు దొంగతనాలే కాకుండా విశాఖ రూరల్ పరిధిలోని రాంబిల్లిలోని వీరాంజనేయస్వామి ఆలయంలోనూ హుండీ దొంగతనం, పరవాడ మార్గంలోని మరో హనుమంతుని ఆలయంలోనూ హుండీ దొంగతనాలు చేశారు. అతన్ని అరెస్టు చేసి తులం బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. దేముడు, లక్ష్మణరావులను రూరల్ పోలీసులకు అప్పగించారు.
ఇదీ చదవండి: చలో మదనపల్లె: తిరుపతిలో ఉద్రిక్తత.. ఎస్సీ సంఘాల నేతల అరెస్టు