విశాఖ జిల్లా గొలుగొండ మండలం జోగంపేట వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గొలుగొండ నుంచి నర్సీపట్నం వైపు వెళుతుండగా మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న జీపును.. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. క్షతగాత్రులను గుర్తించిన అరకు పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి.. వైద్యం నిమిత్తం నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ముగ్గురు వ్యక్తులు కొయ్యూరు మండలం ఎర్రబంధ గ్రామానికి చెందిన గిరిజనులుగా గుర్తించారు.
సమాచారం తెలుసుకున్న గొలుగొండ ఎస్ఐ నారాయణ రావు, సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని ట్రాఫిక్కు అంతరాయం లేకుండా వాహనాలను తొలగించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అతి వేగంగా ప్రయాణించి.. ప్రమాదానికి కారణమైన వాహనంలో గంజాయి సరఫరా చేస్తుండవచ్చని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'ఏలూరు ఘటనపై అధ్యయనానికి ముగ్గురు సభ్యుల కేంద్ర కమిటీ'