కొత్తగా పేర్లు చేర్చడానికి...
బియ్యం కార్డులో కొత్తగా పేరు చేర్చేందుకు దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు వివరాలను అందజేయాలి. సంబంధిత అర్జీని ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తర్వాత ఆరు విడతల్లో విచారణ జరిపి అర్హత ఉంటే పేరు నమోదు చేసి కొత్తకార్డు జారీ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగి, ఆదాయపన్ను, కుటుంబ భాగస్వామి, నాలుగు చక్రాల వాహనం, మున్సిపల్ ఆస్తి, విద్యుత్తు వినియోగానికి సంబంధించిన వివరాలపై ఆయా శాఖల అధికారులతో మాట్లాడి అర్హతను నిర్దేశించనున్నారు.
వీరు అర్హులు..
బియ్యం కార్డు కొత్తగా పొందాలంటే...పొడి, తడి భూములు కలిపి 10 ఎకరాల లోపు ఉండాలి. కుటుంబానికి సొంత కారు కలిగి ఉండరకూడదు. (ట్యాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలు నడిపే వారికి మినహాయింపు), ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారుడై ఉండకూడదు. నివాసం ఉంటున్న ఇంటి విద్యుత్తు వినియోగం నెలకు 300 యూనిట్లు దాటకూడదు.
పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల లోపు ఇల్లు ఉండాలి. కుటుంబ సభ్యులెవరూ ఆదాయ పన్ను చెల్లింపుదారులై ఉండరాదు. ఆయా అర్హతలున్న వారు బియ్యం కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను ఆరు దశల్లో విచారణ చేసి అర్హులను ఎంపిక చేయనున్నారు. ఇదంతా గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఆన్‌లైన్‌లో జరగనున్నది. లబ్ధిదారుడు కచ్చితంగా ప్రజా సాధికారిక సర్వేలో పేరు నమోదు చేసుకుని ఉండాలి.
కార్డులో పేర్ల తొలగింపునకు...
బియ్యం కార్డు నుంచి కుటుంబ సభ్యుల పేర్లు తొలగింపునకు దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు వివరాలను ఇవ్వాలి. అర్జీ అందిన వెంటనే ఆయా వివరాలను జీఎస్‌డబ్ల్యుఎస్ పోర్టల్‌లో నమోదు చేసి విచారణ చేసిన తర్వాత పేర్ల తొలగింపు చేపడతారు. తర్వాత మిగిలిన కుటుంబ సభ్యుల పేర్లతో కొత్త కార్డు జారీ చేస్తారు.
కార్డు అప్పగింతకు..: బియ్యం కార్డు అప్పగింతకు సచివాలయాల్లో ఆధార్ కార్డుల వివరాలను ప్రస్తావిస్తూ దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తుపై విచారణ జరిపిన తర్వాత లబ్ధిదారుని పేరుతో ఉన్న కార్డును రద్దు చేసి ప్రభుత్వానికి అప్పగిస్తారు. వివరాలను ఆన్‌లైన్ నుంచి తొలగిస్తారు.
విభజిత కార్డు కోసం..
విభజిత (స్ప్లిట్) కార్డు కోసం.. ఏ కారణాల చేత కార్డును విభజిస్తున్నదీ తెలియజేస్తూ దరఖాస్తు చేయాలి. కార్డులో ఉన్న కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆధార్ వివరాలు అందజేయాలి. తర్వాత విచారణ జరిపి అర్హత ఉంటే విభజిత కార్డు జారీ చేస్తారు. ఆయా కార్డులను వారి ఇళ్ల వద్దకు వెళ్లి అందజేస్తారు. ఆయా సేవలను సద్వినియోగం చేసుకోవాలని, గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తులను అందజేయాలని జిల్లా సరఫరా అధికారి ఆర్.శివప్రసాద్ తెలిపారు.
గణాంకాలు ఇలా..
- జిల్లాలో మొత్తం లబ్ధిదారులు: 11.90 లక్షలు
- ఇప్పటి వరకు పంపిణీ అయిన కార్డులు: 9.90 లక్షలు
- పంపిణీ చేయాల్సినవి: 2లక్షలు
- కొత్తగా మంజూరు చేసినవి: 32వేలు
ఇదీ చదవండి: దివ్య హత్య కేసు: తల్లిదండ్రుల మరణం తీరుపై పోలీసుల ఆరా