నేరం చేసి పోలీసులకు చిక్కిన నేరస్థులను కోర్టుల్లో హాజరు పరచటం, న్యాయస్థానం శిక్ష విధిచటం, నిందితులను జైలుకు తరలిస్తున్న సమయంలో పోలీసులకు మస్కాకొట్టి వాహనంలో నుంచి తప్పించుకుపోవటం చాలా సినిమాల్లో మనం చూసే ఉంటాం. అచ్చం అలాంటి ఘటనే విశాఖ జిల్లా అనకాపల్లిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే..తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కె.పాల్ శ్యాంసన్, విజయనగరం జిల్లాకు చెందిన గోపీలు విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి ద్విచక్రవాహనంపై అక్రమంగా గంజాయి తరలిస్తున్నారు. వీరిని అనకాపల్లి సుంకరమెట్ట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొని..మూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అనకాపల్లిలో కోర్టులో హాజరుపరచగా..న్యాయమూర్తి రిమాండ్ విధించారు. నిందితులను సబ్జైల్కు తరలిస్తున్న సమయంలో శ్యాంసన్ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు.
సుమారు మూడు గంటలపాటు అతని కోసం వెతకగా..రఘురాం కాలనీ సమీపంలోని శివాజీ అపార్ట్మెంట్స్ పక్కనున్న ఓ ఇంటి మేడపై దాక్కున్నాడు. అపార్ట్మెంట్ సీసీ కెమెరాల ఆధారంగా నిందితుని ఆచూకీ లభించటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీచదవండి
కిడ్నాప్ కేసులో మరో ముగ్గురి కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్