ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తాన్ని అందించడమే అతని కర్తవ్యం. ఒక సారి రక్తదానం చేస్తే ముగ్గురి ప్రాణాన్ని కాపాడొచ్చన్నది ఆయన నమ్మిన సిద్ధాంతం. ఆ సిద్ధాంతమే ఇప్పటివరకు 98 సార్లు రక్తదానం చేసేలా ప్రేరేపించింది. నిత్యం తన విధి నిర్వహణలో ఉంటూనే.. మరోవైపు సమాజంలో తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. జాతీయ యువజన దినోత్సవం, యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, రోటరీ బ్లడ్ బ్యాంక్, రెడ్ క్రాస్ సంస్థ.. ఇలా సంస్థ ఏదైనా రక్తాన్ని దానం చేయడమే తన అభీష్టంగా మలుచుకున్నారు.
బీ.వీ.కె కళాశాల విశ్రాంత సంస్కృత అధ్యాపకులైన రమణ మూర్తి ఇటీవలే 98వసారి రక్తదానం చేసి యువతకు స్ఫూర్తిగా నిలిచారు. నిత్య శారీరక వ్యాయామం, నియమబద్ధమైన ఆహారం తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. అందువల్లనే అన్ని సార్లు వైద్యప్రమాణాలు, కాలపరిమితులకు అనుగుణంగా రక్తదానం చేయడానికి వీలైందని చెబుతున్నారు. యువత సేవాస్ఫూర్తితో రక్త దానం చేయడానికి ముందుకు రావాలని తరచూ బోధిస్తారు. రక్తదానం చేయడం ద్వారా.. సమాజానికి ఉపయుక్తంగా ఉండాలని అచరణాత్మకంగా చూపుతున్నారు వెంకట రమణమూర్తి. కొవిడ్ వల్ల ఇప్పటికే వందసార్లు పూర్తికావాల్సిన తన రక్తదానం ఆలస్యమైందని ఆయన చెబుతున్నారు.
రమణమూర్తి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. వికలాంగులకు 60 వేల రూపాయల విలువైన పరికరాలను విరాళంగా ఇచ్చారు. యువత సామాజిక బాధ్యతపై దృష్టి పెట్టాలనేదే తన ఆకాంక్ష అంటున్నారు వెంకట రమణమూర్తి.
ఇవీ చూడండి...