సముద్ర జలాల్లో ఈనెల 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు మత్య్స ఉత్పత్తులను వేటను ప్రభుత్వం నిలిపివేసింది. మొత్తం 61రోజుల పాటు చేపలవేట నిషేధం అమల్లోకి ఉంటుందని రాష్ట్ర మత్స్యశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత 2020-21 సీజన్ ఈనెల 15వ తేదీతో ముగియనుంది. దేశవ్యాప్తంగా సముద్ర జలాల్లో ఏటా 61 రోజుల పాటు సముద్ర ఉత్పత్తుల వేటను పూర్తిగా నిషేధించనున్నారు. నిషేధ ఆంక్షలను రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు పర్యవేక్షిస్తారు.
నిషేధిత సమయంలో చిరుచేపలు, రొయ్యల ఉత్పత్తి పెద్ద ఎత్తున జరగనుంది. 61రోజుల పాటు మత్స్యవేటను నిలిపివేస్తే తదుపరి దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఏపీ మెరైన్ ఫిష్షింగ్ (రెగ్యులైజేషన్) చట్టం 1994 ప్రకారం నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నామని మత్స్యశాఖ ఇన్‌ఛార్జి జేడీ పి.లక్ష్మణరావు తెలిపారు. మత్స్యరాశుల సమర్థ యాజమాన్య చర్యల్లో భాగంగా నిషేధం అమలు చేస్తున్నామన్నారు. నిషేధ సమయంలో ఎవరైనా వేట సాగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, బోట్లు, మత్స్య ఉత్పత్తులను సైతం సీజ్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చూడండి. నెల్లూరు జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు, లోకేశ్