విశాఖ కేజీహెచ్‌లోని శవాగారంలో ఫ్రీజర్ల కొరత మృతదేహాలు పాడైపోవడానికి కారణమవుతోంది. మృతదేహాలను భద్రపరిచేందుకు 32 ఫ్రీజర్లు ఉండగా... అందులో 18 ఫ్రీజర్లు పని చేయడం లేదు. ఇవి పాడైపోయి నెలలు గడుస్తున్నా ఇంతవరకు బాగు చేయలేదు. శవపరీక్ష కోసం వచ్చే ప్రతి మృతదేహానికి కొవిడ్ పరీక్ష తప్పనిసరిగా చేయాల్సి వస్తోంది. నివేదిక వచ్చిన తర్వాతనే శవపరీక్ష చేయాలి. దీనివల్ల కనీసం మూడు రోజుల పాటు శవాగారంలో ఉంచాల్సిన పరిస్ధితి ఉంది. ఈ విభాగానికి చెందిన ఇద్దరు జూనియర్ వైద్యులు ఇటీవల కొవిడ్ బారిన పడ్డారు. అప్పటినుంచి కొవిడ్ పరీక్షల తర్వాతనే శవపరీక్షలు చేస్తున్నారు.
నెల రోజుల వ్యవధిలో 300 వరకు మృతదేహాలు వచ్చాయి. వీటికి కొవిడ్ పరీక్షలను నిర్వహించారు. ఇందులో 30 వరకు పాజిటివ్ గా తేలాయి. ఉత్తరాంధ్ర జిల్లాల కొవిడ్ ఆసుపత్రి విమ్స్ లో శవాగారం ఉన్నప్పటికీ... అందులో ఫ్రీజర్లు లేకపోవడంతో... అక్కడి మృతదేహాలను కూడా కెజీహెచ్ కే తరలిస్తున్నారు. ప్రస్తుతం 20 వరకు మృతదేహాలున్నాయి. వీటిలో ఇంకా కొన్నింటి కొవిడ్ పరీక్షల నివేదికలు రాలేదు. 14 మాత్రమే ఫ్రీజర్లలో పెట్టారు. మిగిలిన వాటిని శవాగారంలోనే బల్లలపై ఉంచారు. ఫ్రీజర్లకు వెంటనే మరమ్మత్తులు చేయించాలని వైద్యాధికారులు కొరుతున్నారు.
ఇదీ చదవండి: