AP GOVERNMENT: విశాఖ వేదికగా జరిగిన సభలో ప్రధాని మోదీ నుంచి రాష్ట్ర ప్రయోజనాలపై ప్రభుత్వం సరైన ప్రకటన చేయించలేకపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన , ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన ఏ అంశాన్ని పట్టించుకోలేదు. రైల్వే జోన్ అంశం, ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాలను వేదిక నుంచే ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించారు. పదే పదే ప్రధాని మోదీనీ సార్.. సార్..సార్ అంటూ సంబోధించిన ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రానికి వీలైనంత ఆర్థిక సాయం అందించాలని ప్రాధేయపడ్డారు. కేంద్రం నుంచి వచ్చే ప్రతీ రూపాయి రాష్ట్రానికి అవసరం అవుతాయన్నారు.
"ఎనిమిదేళ్ల క్రితం తనకు తగిలిన అతిపెద్ద గాయం నుంచి మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇంకా కోలుకోలేదు సార్. మా గాయాలు మానేలా, మా రాష్ట్రం జాతీయ స్రవంతితో పాటు అభివృద్ధి చెందటానికి వీలుగా.. మీరు సహృదయంతో, విశాల హృదయంతో చేసే ప్రతి ఒక్క సహాయం. మీరు మా రాష్ట్రనికి ప్రత్యేకంగా ఇచ్చే సంస్థ.. మీరు మా రాష్ట్రానికి అదనంగా ఇచ్చే ప్రతి రూపాయి రాష్ట్ర పుననిర్మాణానికి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను సార్. విభజన సంబంధించిన హామీల దగ్గర నుంచి పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు , విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు ఇలా పలు అంశాల మీద పలు సందర్భాలలో మీకు చేసిన పలు విజ్ఞప్తులు మీరు సానకూలంగా పరిగణలోకి తీసుకుని పెద్ద మనసులో వాటినంన్నింటిని కూడా పరిష్కరించాలని మనసారా కూడా కోరుకుంటు.. పెద్దలైన మీ ఆశీస్సులు." -ముఖ్యమంత్రి జగన్
అయితే ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఎక్కడా ఈ అంశాలను ప్రస్తావించలేదు. రాష్ట్రానికి నిధులు, అభివృద్ధి ప్రాజెక్టుల గురించి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రస్తుత మిజోరాం గవర్నర్ హరిబాబులు గుర్తు చేసేవారని ప్రధాని చెప్పారు తప్ప.. ముఖ్యమంత్రి అడిగిన ఏ అంశంపైనా స్పందించలేదు. మోదీ బహిరంగ సభకు కోసం భారీ ఎ్తతున జనసమీకరణ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సానుకూల ప్రకటనలు చేయించుకోవాలని ఆశపడినా నిరుత్సాహమే మిగిలింది.
విశాఖలో ప్రధాని మోదీ సభతో రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలను సాధించడంలో సీఎం జగన్ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. కేసుల మాఫీ కోసమే బల ప్రదర్శన చేశారని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. 25 ఎంపీ సీట్లు ఇస్తే నిగ్గదీస్తానని చెప్పిన జగన్ ప్రధాని ఎదుట పిల్లిమొగ్గలు వేశారని ఎద్దేవా చేశారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై ప్రధాని సానుకూలంగా స్పందిస్తారేమోనని.. ఎదురుచూసిన ఉద్యోగులు, కార్మికులకూ నిరాశే మిగిలింది. రాష్ట్రానికి ఏ నూతన హామీని ప్రధాని ఇవ్వకపోవడం బాధాకరమని.. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: