Graduates MLC elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నిబంధనలను ఉల్లంఘిస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. విశాఖలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. వైసీపీ ఈ ఎన్నికల్లో ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు పంచేందుకు సిద్ధంగా ఉందని ఆరోపించారు. జనసేన పార్టీ తమతోనే ఉందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. జనసేన సహకారంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
స్టిక్కర్ సీఎం : ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లతో వైసీపీ గెలవాలని చూస్తోందని.. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం జగన్ రాజ్యాంగం అములవుతోందని మండిపడ్డారు. వాలంటీర్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరోక్ష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని భాను ప్రకాష్ ఆరోపించారు. దొంగ ఓట్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ సక్సెస్ పుల్ సీఎంగా కాకుండా స్టిక్కర్ సీఎంగా నిలిచారని ఎద్దేవా చేశారు.
ప్రత్యామ్నాయం బీజేపీనే : పశ్చిమ రాయలసీమ పట్టబద్రుల బీజేపీ అభ్యర్థి నగరూరు రాఘవేంద్రను గెలిపించాలని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ అభ్యర్థించారు. పట్టభద్రుల ఓటర్లతో సమావేశమైన ఆయన.. ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ప్రత్యమ్నాయం బీజేపీ, జనసేన కూటమినే అని స్పష్టం చేశారు. వచ్చే 2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ని గెలిపించాలని కర్నూలు తెలుగు దేశం పార్టీ బాధ్యుడు టీజీ భరత్, కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాల మైదానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని పిలపునిచ్చారు.
ఉద్యోగ ప్రకటనలపై నిర్లక్ష్యం : విశాఖ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో అల్లూరి స్టడీ సర్కిల్ డీవైఎఫ్ఐ సంయుక్త ఆధ్వర్యంలో గ్రూప్ 2 పరీక్షలకు ఉచిత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కె. ఎస్ లక్ష్మణరావు ఆరోపించారు. రాష్ట్రంలో 20వేల ఉపాధ్యాయ పోస్టులతో పాటుగా... వివిధ శాఖలల్లో రెండు లక్షల పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల పీడీఎఫ్ అభ్యర్థి డాక్టర్ కోరుట్ల రమాప్రభ పాల్గొన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు అందించి శాసనమండలికి పంపాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: