జీవీఎంసీ పరిధిలో ఇప్పటికే 16 రోడ్లను వ్యర్థ ప్లాస్టిక్ మిశ్రమాన్ని కలిపి వేశారు. వీటిలో కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా అరకిలోమీటరు నుంచి 3కి.మీ వరకు రెండేళ్లక్రితం నిర్మించారు. అప్పట్లో ఈ ప్రయోగానికి స్వచ్ఛసర్వేక్షన్ కేంద్ర పరిశీలన బృందాల నుంచి ప్రశంసలూ అందాయి. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో మరిన్ని రోడ్లను వ్యర్థ ప్లాస్టిక్ మిశ్రమాన్ని కలిపి వేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈసారి 8 జోన్లలోనూ ఒక్కో రోడ్డు ఉండేలా సుమారు 10.2 కి.మీ మేర వేయనున్నట్లు జీవీఎంసీ అధికారులు స్పష్టతనిచ్చారు.
వీటి కోసం సుమారు రూ.20 కోట్లవరకు వెచ్చించే అవకాశముందని తెలిపారు. రోడ్ల వెడల్పును బట్టి ఖర్చులో మార్పులొస్తాయని స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం ఎంవీపీకాలనీ సెక్టార్-5లో ఓ రోడ్డుతో ఈ పనులు మొదలుపెడుతున్నారు. జీవీఎంసీ వేసే రోడ్లలో తారు మిశ్రమంలో 8శాతం మాత్రమే ప్లాస్టిక్ వ్యర్థాల్ని కలపనున్నారు. గతంలో కాపులుప్పాడ డంపింగ్ యార్డు నుంచి ప్లాస్టిక్ వ్యర్థాల్ని తీసుకోవాలని చూసినా.. అప్పట్లో (2017-18) ప్లాస్టిక్ వేరుచేసే ప్రక్రియ సరిగాలేక ఆ ప్రయత్నం చేయలేదు.
ఇతర వ్యర్థ ప్లాస్టిక్ నుంచి రోడ్లు వేశారు. ఇప్పుడు జీవీఎంసీ సేకరించే చెత్తలో వచ్చే వ్యర్థ ప్లాస్టిక్‌నే వినియోగించాలని చూస్తున్నారు. ఈ రోడ్లు వేసేందుకు అనువైన వాతావరణముండాలని.. లేకపోతే వేయలేమని జీవీఎంసీ ఇంజినీర్లు చెబుతున్నారు. ఎక్కువ ఎండ ఉండి వర్షాలుపడని పరిస్ధితుల్లోనే వేస్తామని స్పష్టతనిస్తున్నారు. స్వచ్ఛసర్వేక్షన్ - 2021లో ఘనవ్యర్థాల నిర్వాహణపరంగా ఈ రహదారులు కీలకంగా మారనున్నాయని సీఈ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు.
ఇదీ చదవండి: వైరల్ కంటెంట్ నియంత్రణకు ఫేస్బుక్ కీలక నిర్ణయం!