RAVIVARMA: విధి ఆ యువకుడిని చక్రాల కుర్చీకే పరిమితం చేసింది. కానీ మనసు వందల కిలోమీటర్లు చుట్టి రమ్మంది. పట్టుదలతో అడుగు ముందుకేశాడు. గట్టి సంకల్పం తీసుకున్నాడు. వీల్ ఛైర్‌ను వెంటబెట్టుకునే తనకు బాగా ఇష్టమైన డ్రైవింగ్ చేసుకుంటూ.. వంద రోజుల యాత్ర మొదలుపెట్టాడు.
విశాఖ వాసి రవివర్మ ఇంజనీరింగ్ చదివే సమయంలో ప్రమాదానికి గురయ్యారు. వెన్నుపూస దెబ్బతిని.. చక్రాల కుర్చీకే పరిమితం అయ్యారు. స్వతహాగా లేచి నిల్చోలేని పరిస్థితి. రవివర్మకు డ్రైవింగ్ అంటే బాగా ఇష్టం. మనసేమో స్టీరింగ్ పట్టమంటోంది. కాళ్లేమో ఎక్సలేటర్ తొక్కమంటున్నాయి. కానీ వెన్నెముక వెనక్కులాగుతోంది. కొన్నాళ్లు మథనపడిన రవివర్మ.. రెండుచక్రాల కుర్చీలో నుంచి నాలుగు చక్రాల వాహనం ఎక్కారు. మళ్లీ స్టీరింగ్ పట్టారు. ఇక అంతే ఉత్సాహం ఉరకలేసింది. పట్టుదల పద ముందుకు అంటూ ప్రోత్సహించింది. ఇందులో భాగంగానే యునెస్కో నగరాలు చుట్టివచ్చేందుకు వెళ్లారు రవివర్మ.
తనలాంటి బాధితులకు స్ఫూర్తిగా నిలవాలనుకున్నారు రవివర్మ. ర్యాంపు ఫౌండేషన్ నెలకొల్పారు. కారులో... ప్రత్యేకంగా మార్పులు చేసుకున్నారు. 24 వేల కిలోమీటర్లను వంద నుంచి 120 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా సాగిపోతున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలను చుట్టి రానున్న రవివర్మ.. తనతోపాటు ఒక ఫిజియోధెరపిస్ట్‌ని వెంట తీసుకెళ్లారు.
ఇదీ చదవండి: దక్షిణాది గ్రిడ్‌లో లోపం.. ఎన్టీపీసీ సింహాద్రిలో నిలిచిన విద్యుదుత్పత్తి