విశాఖ జిల్లా మాడుగుల మండలంలో ఉన్న పెద్దేరు జలాశయం నుంచి పెద్దేరు ఆయకట్టుకు గురువారం నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సాగు నీటిని విడుదల చేయాలని రైతుల విజ్ఞప్తి మేరకు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలాశయంలో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు చేరిందనీ.. ప్రస్తుతం నీటి మట్టం ఆశాజనకంగా ఉన్నట్లు వివరించారు.
ఎగువ ప్రాంతంలోని గెడ్డలు నుంచి జలాశయంలోకి 90 క్యూసెక్కుల మేరకు వరద నీరు చేరిందనీ.. గరిష్ట స్థాయి నీటిమట్టం 137 మీటర్లు కాగా, ప్రస్తుతం 135.50 మీటర్ల వరకు నీటిమట్టం ఉన్నట్లు వెల్లడించారు. పెద్దేరు జలాశయం పరిధిలో మాడుగుల మండలంతో పాటు బుచ్చయ్యపేట, రావికమతం మండలాలకు చెందిన 19,969 ఎకరాల ఆయకట్టు పొలాలు ఈ సాగునీటి ద్వారా లబ్ధి పొందనున్నాయి. సాగునీటి విడుదల ఖరారు కావడంతో జలాశయం ప్రాంతంలో ఖరీఫ్ వరినాట్లకు ఆయకట్టు రైతులు సన్నద్ధమవుతున్నారు.
ఇదీ చదవండి: మన్యంలో కరోనా కట్టడికి అవగాహన కార్యక్రమం