Pawan Kalyan visited CBCNC lands in Visakhapatnam: జనసేన అధినేత పవన్ కల్యాణ్ 'వారాహి విజయ యాత్ర' పేరుతో విశాఖపట్నంలో గత మూడు రోజులుగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. నేటి పర్యటనలో ఆయన విశాఖలోని సిరిపురం సీబీసీఎన్‌సీ భూములను సందర్శించారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సంస్థ నిర్మిస్తున్న భవనాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వైఎస్సార్సీపీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Pawan criticizes YCP leaders.. రాష్ట్రంలో జరుగుతున్న భూదోపిడీకి అధికార పార్టీ నేతలే ప్రధాన సూత్రధారులు, లబ్దిదారులని.. పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇది రాష్ట్రం నలుమూలల తేటతెల్లమయ్యే రోజులు వస్తున్నాయని తెలిపారు. ఎంవీవీ సత్యనారాయణపై ఉన్న నమ్మకంతో ప్రజలు ఓట్లేసీ ఎంపీగా గెలిపిస్తే.. జనాన్ని వదిలేసి పారిపోతానని అనటం సిగ్గుచేటన్నారు. వైసీపీ నాయకులు చేస్తున్న అక్రమాలకు ఏ వాస్తూ సహకరించదన్న పవన్ కల్యాణ్.. ఉత్తరాంధ్ర దోపిడీలపై విద్యార్థి లోకం తిరగబడాలని పిలుపునిచ్చారు.
Pawan fire on CM Jagan.. అధికారం పేరుతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అక్రమాలు, భూ కబ్జాలను గుర్తుపెట్టుకుంటున్నామన్న పవన్.. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి దానిపైనా జగన్ కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. భూముల అక్రమం గురించి జనవాణి కార్యక్రమంలో రాష్ట్రీయ క్రిస్టియన్ పోరాట సమితి ప్రతినిధులు తన దృష్టికి తీసుకొచ్చారని పవన్ వివరించారు. ఇక్కడ జరుగుతున్న అక్రమాలను స్వయంగా పరిశీలించాలనే తాను ఈరోజు ఇక్కడికొచ్చానన్నారు. చట్టం పట్ల ఎలాంటి బెరుకు, భయం, గౌరవం లేకుండా వైసీపీ నాయకులు అత్యంత విలువైన స్థలాన్ని ఆక్రమిస్తున్నారని మండిపడ్డారు. దీనికి అధికారమే అసలు పెట్టుబడిగా కొనసాగుతోందని పవన్ దుయ్యబట్టారు.
Pawan harsh comments on MP MVV.. సొంత కుటుంబాన్ని కాపాడుకోలేని విశాఖ ఎంపీ.. మీడియా ముందు అది తమ పార్టీకి సంబంధించిన విషయం అని చెప్పడం సిగ్గుచేటని పవన్ కల్యాణ్ విమర్శించారు. తన వ్యాపారాలను హైదరాబాద్‌కు మారుస్తానని, ఇక్కడ నుంచి పారిపోతానని చెప్పడానికి సిగ్గుండాలన్నారు. 'అంత భయపడితే రాజీనామా చేయ్.. ఎన్నికలకు వెళ్దాం.' అంటూ పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలు కూడా.. ఇలాంటి వారికి ఎందుకు ఓట్లేసి గెలిపించారో..? ఒకసారి ఆలోచించాలని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. విశాఖలో దొరికిన భూమిని దొరికినట్లు కాచేస్తున్న ఈ వైసీపీ నేతలను ఇక్కడ నుంచి తరిమి కొట్టాలని ప్రజలకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. రాజకీయ చైతన్యం, పోరాట చైతన్యం కలిగిన ఉత్తరాంధ్ర ప్రజలు ఈ దాష్టీకాల మీద పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ సాధనలో ఉస్మానియా విద్యార్థులు ఎంతగా తెగించి కొట్లాడారో.. ఉత్తరాంధ్రలో జరుగుతున్న పాలకుల దోపిడీ మీద ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు కూడా అంతే చైతన్యవంతులై పోరాడాలన్నారు.
విశాఖపట్టణాన్ని కేంద్రం ప్రభుత్వం ఓ ప్రత్యేక దృష్టితో చూస్తోంది. దేశ భద్రతపరంగా విశాఖ నగరం చాలా కీలకం. ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీ నేతలు దోపిడీ చేస్తున్నారు. విశాఖలో అధికార పార్టీ నేతల కబ్జాలు పెరిగిపోయాయి. చట్టాలను అతిక్రమించిన వారికి టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. ఇక్కణ్నుంచి పారిపోతామని చెప్పడం విశాఖ ఎంపీకి తగదు. విశాఖ ప్రజలు ఓటేస్తేనే ఎంవీవీ ఎంపీ అయ్యారు. ఎక్కడికో వెళ్లి వ్యాపారం చేస్తానని ఎంపీ అనడం సిగ్గుచేటు. చర్చి ఆస్తులను అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు. సీఎంవోలోనే దొంగ సంతకాలు చేయడం దారుణం.-పవన్ కల్యాణ్, జనసేన అధినేత