విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో భూగర్భంలో కాలం చెల్లిన పైపులైను తొలగించి కొత్తవి ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం సుమారు కోటి రూపాయలు కేటాయించి పైపులైను పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. నర్సీపట్నం గ్రామపంచాయతీగా ఉన్న రోజుల్లోనే సుమారు ఏడు దశాబ్దాల కిందట రక్షిత నీటి పథకం ద్వారా తాగునీటిని అందించేవారు.
అప్పట్లో అమర్చిన పైపులు ఇప్పటికీ ఉన్నాయి. తరచూ ఎక్కడో ఓ చోట పైపులైను పగలడం, తద్వారా నీటి సరఫరాకు విఘాతం కలుగుతోంది. సరఫరాను తరచూ నిలిపివేయాల్సి వచ్చేది. మరమ్మతు పనులు చేసేందుకు 1, 2 రోజులు సరఫరా నిలిచిపోయేది. ప్రతిసారి రూ.20 వేల నుంచి 30 వేల వరకు ఇందుకోసం ఖర్చయ్యేది. ఈ విధంగా ఎప్పటివరకు సుమారు కోట్లలోనే ఖర్చు చేశారు. పురపాలక సంఘం నుంచి 14వ ఆర్థిక సంఘం నిధులతో కాలంచెల్లిన పైపుల సమస్యకు మోక్షం కలిగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వాస్తవానికి ఈ పనులను ఈ ఏడాది జనవరిలోనే ప్రారంభించినప్పటికీ మధ్యలో ఏర్పడిన కరోనా లాక్డౌన్ కారణంగా పనులకు కొంత విఘాతం కలిగింది.
పరిస్థితి కాస్త కుదుటపడడంతో పనులు తిరిగి ఇటీవలే పునః ప్రారంభించారు. ప్రస్తుతం ఇవే చివరి దశకు చేరుకున్నాయి. చింతపల్లి , అనకాపల్లి మార్గాలలో కోటి రూపాయల వ్యయంతో సుమారు 2500 మీటర్ల పొడవున పైపులైను ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. నర్సీపట్నం ఫోన్లో చేపట్టిన కొత్త పైపులైను పనులు వారం రోజుల్లో పూర్తవుతాయని అధికారులు పేర్కొంటున్నారు.