Visakha Steel Plant Preservation Committee : విశాఖ స్టీల్ ప్లాంట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి ముఖ్య సమావేశం జరిగింది. ఈ నెల 11 న విశాఖలో అమిత్ షా పర్యటన, బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యాన సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమావేశంలో స్టీల్ ప్లాంట్ గుర్తింపు సంఘ అధ్యక్షుడు ఆదినారాయణ, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి అయోధ్యరాం, ఐఎన్టీయూసీ అధ్యక్షుడు రామచంద్ర, టీఎన్టీయూసీ అధ్యక్షుడు విలూరి రామ్మోహన్ రావు తదితర నాయకులు పాల్గొన్నారు. గంటన్నర సేపు సమావేశం అనంతరం అమిత్ షా పర్యటన సందర్భంగా రెండు రోజులు నిరసన తెలపాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 10న నల్ల బ్యాడ్జీ లతో స్టీల్ ప్లాంట్లో నిరసన, అదే విధంగా 11 వ తేదీన కూర్మన్నపాలెం కూడలి వద్ద కార్మికుల మహా నిరసన చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ ద్వారా అమిత్ షా ను కలిసే అనుమతిని కోరనున్నట్టు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి సభ్యులు చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రకటనను విరమించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
850 రోజులుగా స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ వ్యతిరేకోద్యమం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారనే సమాచారంతో నిరసన తెలపాలని నిర్ణయించుకున్నాం. ఎన్నో పోరాటాలు, ఎంతో మంది త్యాగాలు, 16 వేల మంది భూ నిర్వాసితుల దయతో సాధించుకున్న ఉత్తరాంధ్ర జీవనాడి అయిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయించడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిని ఉపసంహరించుకుంటున్నట్లుగా అమిత్ షా ప్రకటించాలి. - అయోధ్యరాం, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయించాలని విక్రయించాలన్న క్యాబినెట్ తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 10, 11వ తేదీల్లో దీక్షలు చేయనున్నాం. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో బీజేపీకి వ్యతిరేకంగా పని చేయడానికి సిద్ధం. - ఆదినారాయణ, స్టీల్ ప్లాంట్ గుర్తింపు సంఘం అధ్యక్షుడు
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. 800రోజులకు పైగా ప్రజా సంఘాలు, పార్టీలు, కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళలను ప్రభుత్వం పట్టించుకోక పోవడం విచారకరం. పైగా, ప్రైవేటీకరణకే ప్రభుత్వం మొగ్గుచూపుతుండడం దురదృష్టకరం. - రామచంద్రరావు ఐఎన్టీయూసీ అధ్యక్షుడు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రయత్నాలు మొదలు పెట్టిన దగ్గర్నుంచి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. మాకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు వేలాది కుటుంబాలు వీధిన పడకుండా అమిత్ షా హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. - పల్లా పెంటారావు, స్టీల్ ప్లాంట్ యువ కార్మిక సంఘం నేత