విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం మేడివాడలో ఆదివారం రాత్రి ఓ ఇంట్లో అనధికారికంగా బాణసంచా తయారీ చేస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు(60) సజీవ దహనమైంది. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాణసంచా తయారు చేస్తున్న భవనంతోపాటు పక్కనే ఉన్న మరో ఇల్లూ నేలమట్టం అయ్యాయి. మరో పది ఇళ్ల గోడలు, శ్లాబులు బీటలు వారాయి. తలుపులు ఊడిపడ్డాయి. టీవీలు, ఫ్రిజ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ సామగ్రి పగిలిపోయాయి.
స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. మేడివాడలో కొనగళ్ల శివ అనుమతి లేకుండానే భారీగా బాణసంచా తయారీ చేస్తున్నారు. కొద్దిరోజుల్లో దీపావళి వస్తుండంతో కుటుంబ సభ్యులతో కలిసి చిచ్చుబుడ్లు, టపాసులు తయారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఉన్నట్టుండి పేలుడు సంభవించింది. ఘటన స్థలంలో శివ, అతడి కుమారుడు మనోజ్, తల్లి నూకరత్నం ఉన్నారు. శివ, మనోజ్‌లు తప్పించుకున్నారు. వృద్ధురాలు కావడంతో నూకరత్నం బయటకు రాలేక, మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైంది. పేలుడు ధాటికి పక్కనే ఉన్న నడిపిల్లి గణేష్ భవనం కూడా కూలిపోయింది. ఆ ఇంట్లోని దూలం అతని తల్లి దేముడమ్మపై పడటంతో ఆమె రెండు కాళ్లు, చేతులు విరిగిపోయాయి. వేరే ఇళ్లలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. బాధితులను అంబులెన్సులో నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. పేలుడు కారణంగా ఆ ప్రాంతంలో విద్యుత్తు తీగలు తెగిపడటంతో అంధకారం అలముకుంది. కొత్తకోట సీఐ లక్ష్మణమూర్తి, రావికమతం ఎస్సై జోగారావు సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాద కారణాలపై ఆరా తీశారు. ప్రమాదానికి కారణమైన వ్యాపారి శివ, అతని కుమారుడు మనోజ్‌పై స్థానికులు దాడికి యత్నించారు. పోలీసులు వారిని నిలువరించారు. రావికమతం అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
ఇదీ చదవండి