ఆంధ్రా - ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ ఖండ్ పవర్ ప్లాంట్‌ను ఒడిశా జలవిద్యుత్ శాఖ సీఎండీ బిష్ణు పద సెట్టి సందర్శించారు. మొదట జోలపుట్ జలాశయానికి వెళ్లి అక్కడి నుంచి దించి హౌస్ వద్దకు చేరుకున్నారు. అక్కడ దించి హౌస్ ప్రాజెక్టు ఎస్ఈ కె.వి. నాగేశ్వరరావు పుష్ప గుచ్ఛంతో స్వాగతం పలికారు.
విద్యుత్ కేంద్రంలో అన్నీ పరిశీలించిన తరువాత సమావేశ మందిరంలో అధికారులతో బిష్ణు పద సెట్టి సమీక్షా సమావేశం నిర్వహించారు. అత్యంత పురాతన జలవిద్యుత్ కేంద్రం గురించి రేపటి తరం తెలుసుకోవడానికి ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రాజెక్ట్ ఆధునికీకరణ నేపథ్యంలో లోయర్ మాచ్ ఖండ్, జోలపుట్ మినీ జలవిద్యుత్ కేంద్రాల నిర్మాణానికి అవకాశాలు గురించి ఇరు రాష్ట్రాల అధికారులతో చర్చలు జరుపుతామన్నారు.
ప్రాజెక్ట్‌లో పలు చోట్ల పార్క్‌లు నిర్మించాలని ఆయన అన్నారు. ఇరు రాష్ట్రాల అధికారులు మాచ్ ఖండ్ ప్రాజెక్ట్ నిర్వహణ బాగా చేస్తున్నారని ప్రశంసించారు. సీఎండీతో పాటు ఒడిశా జలవిద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, కొరపుట్ ఏడీఎంవో, తహసీల్దార్లు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్‌గా గౌతమ్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ