NGT On HETERO Industry: హెటెరో పరిశ్రమ నుంచి వ్యర్థాల తరలింపునకు వేసిన పైపులైనును పూర్తిగా తొలగించాలని పరిశ్రమ యాజమాన్యాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్‌జీటీ) కమిటీ ఆదేశించింది. పరిశ్రమలో నుంచి వచ్చే కాలుష్యం వల్ల ఇబ్బంది పడుతున్నామని మత్స్యకార ఐకాస నాయకులు, స్థానికుల ఫిర్యాదు మేరకు ఏర్పాటైన ఎన్‌జీటీ కమిటీ మంగళవారం విశాఖ జిల్లా నక్కపల్లిలోని పరిశ్రమ వద్దకు చేరుకుంది. ఐకాస నాయకులు, స్థానికులతో మాట్లాడి ఆయా ప్రాంతాలను పరిశీలించింది. గతంలో కొంతమేర పైపులను తొలగించారని, ఇంకా తొలగించాల్సి ఉందని మత్స్యకారులు కమిటీ సభ్యులకు తెలిపారు. దీంతో పైపులైనును పూర్తిగా తొలగించి, పరిశ్రమలోని ఓ చెరువునూ కప్పేయాలని యాజమాన్యాన్ని ఆదేశించారు.
రాజయ్యపేట, తీనార్ల, దొండవాక గ్రామస్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. నీరు, వాయు కాలుష్యంతో ఉద్యాన పంటలు దెబ్బతింటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేయగా.. ఆకులపై కాలుష్యం మడ్డిని, నీటి నమూనాలను సేకరించారు. అనంతరం కమిటీ బృందం హెటెరో పరిశ్రమకు చేరుకుని ప్లాంట్లను పరిశీలించి ప్రతినిధులతో సమావేశమైంది. కమిటీలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ ప్రమోద్‌కుమార్‌రెడ్డి, డీఎఫ్‌ఓ అనంతశంకర్, పర్యావరణ శాఖ ఇంజినీర్ డి.రవీంద్రబాబు, శాస్త్రవేత్తలు డాక్టర్ పి.సురేష్‌బాబు, డాక్టర్ వీవీఎస్‌ఎస్ శర్మ, ఎస్.కార్తికేయన్‌తోపాటు భూగర్భ జలవనరుల శాఖ, ఉద్యాన, వ్యవసాయశాఖ అధికారులు ఉన్నారు.
ఇదీ చదవండి: cabinet Meeting : ఏప్రిల్ 11న మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ ?