విశాఖపట్నంలో నౌకాదళ విశ్రాంత అధికారిని కొందరు సైబర్ నేరగాళ్లు మోసం చేసిన తీరు కలకలం రేపుతోంది. ఉద్యోగ విరమణ అనంతరం ఆయన విశాఖలోని మహారాణిపేట ప్రాంతంలో నివసిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో సాండ్రా జేమ్స్ అనే మహిళ పరిచయం అయింది. జూన్ 30న ఆయనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. నాలుగు రోజుల వ్యవధిలో ఆయనకు వాట్సాప్‌లో సందేశాలు పెట్టింది. పరిచయమైన సందర్భంగా బహుమతి పంపిస్తున్నానని పేర్కొంటూ ఆ పార్సిల్‌కు సంబంధించిన రశీదును వాట్సాప్ చేసింది.
జులై 13న అనిత అనే మహిళ నుంచి ఆయనకు ఫోన్‌కాల్ వచ్చింది. దిల్లీలోని ‘ఫారిన్ పార్సిల్ డిపార్ట్‌మెంట్ రిజిస్ట్రేషన్ కార్యాలయం’ నుంచి మాట్లాడుతున్నానని, ఆ పార్సిల్‌ను పంపడానికి క్లియరెన్స్ ఛార్జీలు రూ.22,500 చెల్లించాలని సూచించారు. దీంతో ఆ మొత్తాన్ని బ్యాంకు ద్వారా చెల్లించారు. మరుసటి రోజు అనిత మళ్లీ ఫోన్ చేశారు. పార్సిల్‌ను స్కాన్ చేయగా అందులో లక్ష పౌండ్ల నగదు, ఐఫోన్, బంగారు గడియారం, యాపిల్ ల్యాప్‌టాప్, రెండు పెర్ఫ్యూమ్ సీసాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆ లక్ష పౌండ్ల విలువే సుమారు రూ.94 లక్షలకుపైగా విలువుండడంతోపాటు ఇతర వస్తువుల విలువ రూ.లక్షల్లోనే ఉంటుందని తెలిపారు. రూ.1.05 లక్షలు చెల్లించి యాంటీ మనీలాండరింగ్ పత్రం పొందాలని సూచించారు. ఇలా.. పలు దఫాలుగా ఆయన నుంచి రూ. 1,63,79,420 వసూలు చేయడం గమనార్హం. విషయం సీబీఐ అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు విశ్రాంత నౌకాదళ అధికారికి ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించడంతో ఆయన పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించారు.
ఇదీ చదవండి: ఏపీలో మరో పారిశ్రామిక కారిడార్...కర్నూలు జిల్లాలో క్లస్టర్