విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిని మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసులు, శ్రీరంగనాథరాజు దర్శించుకున్నారు. స్వామీజీ సలహాలు సూచనల కోసం వచ్చినట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడూతూ.. గత ప్రభుత్వ హయాంలో సింహాచలం దేవస్థానంలో అవకతవకలు జరిగాయనీ.. వాటిపై దర్యాప్తు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అన్ని మతాలను గౌరవించే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం మన అదృష్టమని మంత్రి అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం పని చేస్తోందన్నారు.
సింహాచల పంచగ్రామాలపై కమిటీ వేశామనీ.. అన్ని నివేదికలు హైకోర్టుకు సమర్పించినట్లు మంత్రి వివరించారు. హైకోర్టు తీర్పు రాగానే, పంచగ్రామాల సమస్య పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎన్నికల్లో పంచగ్రామాల ప్రజలకు ఇచ్చిన హమీల మేరకు తీపి కబురు చెప్తామని అన్నారు. గతంలో పుష్కరాల సమయంలో అవసరం లేకపోయినా.. చాలా ఆలయాలను చంద్రబాబు తొలగించారనీ.. వాటిని తమ ప్రభుత్వ హయాంలో నిర్మిస్తామని మంత్రి వెల్లడించారు.
ఇదీ చదవండి: 'సీఎం జగన్కు లభిస్తున్న ఆదరణ తట్టుకోలేకే తెదేపా ఆరోపణలు'