విశాఖ పంచ గ్రామాల కేసును.. కోర్టు త్వరితగతిన డిస్పోస్ చేసేందుకు అఫిడవిట్ దాఖలు చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. పంచ గ్రామాల సమస్యపై.. మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధుల కమిటీ వివిధ అంశాలపై చర్చించిందని పేర్కొన్నారు. ఈ కమిటీ భేటీలో మంత్రులు అవంతి, కన్నబాబు కూడా పాల్గొన్నారు.
సింహాచలం దేవస్థానానికి చెందిన 9 వేల ఎకరాల భూమిని కాపాడేందుకు తగిన చర్యలు చేపట్టాలని కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు. పంచ గ్రామాల్లో నివసిస్తున్న 12 వేల 149 మంది స్థానికులకు క్రమబద్ధీకరణ చేసే అంశంపై చర్చించినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.
కాలం చెల్లిన కట్టడాలకు మరమ్మతులు చేసుకునేందుకు సింహాచలం ఈవోకు అనుమతి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పూరి పాకల స్థానంలో.. గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే రూ. 20 కోట్లతో.. 9 వేల ఎకరాల భూమిలో పూర్తిగా దాతల నుంచి విరాళాలు తీసుకుని కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
23 కిలో మీటర్ల మేర గిరి ప్రదక్షిణకు వీలుగా అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేయనున్నట్లు వెల్లడించారు. 100 గజాల వరకు ఉచితంగా, 100 - 300 గజాల వరకు 75 శాతం.. ఆపై ఆక్రమణలకు వంద శాతం ఫీజుతో క్రమబద్ధీకరణ చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. విధివిధానాలు కోసం త్వరలోనే కమిటీ సమావేశమవుతుందని వెల్లడించారు.
ఇదీ చదవండి: