విశాఖపట్నం పోర్టు నుంచి భీమిలి మీదుగా భోగాపురం వరకు నిర్మించనున్న రహదారి మధ్యలో ఒకచోట ఐకానిక్ వంతెన నిర్మించడానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రహదారులు, భవనాలశాఖ మంత్రి ఎం.శంకరనారాయణ తెలిపారు. ఆ శాఖకు చెందిన ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల ఉన్నతాధికారులతో బుధవారం విశాఖలో రహదారుల అభివృద్ధిపై సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. భోగాపురంలో నిర్మించబోయే గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును విశాఖతో అనుసంధానించేలా రూ.1700 కోట్లతో బీచ్ కారిడార్ మాదిరిగా కొత్త రహదారి నిర్మించబోతున్నట్లు వివరించారు. అందులో భాగంగా ఒకచోట గోస్తనీ నదిపై 2.6 కి.మీ మేర రూ. 500 కోట్లతో ఐకానిక్ వంతెన నిర్మించాలని సీఎం సూచించినట్లు తెలిపారు. ఓ కన్సల్టెన్సీ సంస్థ డీపీఆర్ తయారు చేస్తోందన్నారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి నుంచి విజయనగరం జిల్లా బౌడార కూడలి వరకు ప్రస్తుతమున్న రోడ్డును జాతీయ రహదారిగా మార్చడానికి ప్రతిపాదన పంపినట్లు చెప్పారు. అప్పటిలోగా ఆ రహదారిని అభివృద్ధి చేయడానికి రూ.5 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని సీఎం జగన్ కలిసిన తరవాత రూ. 12,500 కోట్ల వ్యయంగల అదనపు పనులు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలోగా రూ. వెయ్యి కోట్లతో రహదారుల నిర్వహణ పనులు పూర్తి చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
ఇదీ చదవండి: