విశాఖ ఉక్కు పరిశ్రమ, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. విశాఖలోని జీవీఎంసీ వద్ద రిలే నిరాహార దీక్షా శిబిరం ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కొవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి దీక్షలో పాల్గొంటున్న ఉద్యోగులు, కార్మికులు, ప్రజా సంఘాల సభ్యులను అఖిలపక్ష నాయకులు అభినందించారు. కరోనా సమయంలో ఆస్పత్రులకు ఆక్సిజన్ అందించి, కొవిడ్ బాధితుల ప్రాణాలు కాపాడిన స్టీల్ ప్లాంట్, ఇతర ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్ని అవాంతరాలు వచ్చినా... విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగే వరకు ఆందోళన కొనసాగించాలని అఖిలపక్ష నాయకులు నిర్ణయించారు. ఈ నెల 26న మోదీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా అన్నీ జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో ఆందోళన నిర్వహించాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా నగరంలోని అన్నీ పరిశ్రమలు, జీవీయంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసనలు జరపాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఈ నెల 29న స్టీల్ ఉద్యోగులు, కార్మికులు తలపెట్టిన సమ్మెకు, 30న దేశవ్యాప్తంగా ఉక్కు పరిశ్రమల కార్మికులు నిర్వహించే సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపారు.
ఇదీ చదవండి: Vamshadhara: సుదీర్ఘకాలం తర్వాత సమస్యకు పరిష్కారం: జగన్