వచ్చే ఏడాది జనవరి 10 నుంచి జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీలకు, ఇతర ప్రభుత్వ సంస్థల భవనాలకు తాగునీటి సదుపాయం కల్పించాలని విశాఖ జేసీ అరుణ్ బాబు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జల జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జాతీయ జల జీవన్లో భాగంగా..
కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖలో తాగునీరు, శానిటేషన్ విభాగం 2024లోగా జాతీయ జల జీవన్ మిషన్ కార్యక్రమం కింద నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కుళాయి కనెక్షన్ ద్వారా ఇంటింటికి మంచి నీటి సరఫరాకు కేంద్రం రూపకల్పన చేసిందన్నారు.
జనవరి 10లోగా..
వంద రోజుల కార్యక్రమంలో భాగంగా వచ్చే జనవరి 10 లోగా గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని పాఠశాలలు, అంగన్ వాడీలు, ఇతర ప్రభుత్వ సంస్థల భవనాలకు కుళాయి కనెక్షన్ల ద్వారా తాగునీటి సరఫరా లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
శుభ్రమైన తాగునీరు..
ఇందులో భాగంగా రక్షిత, పరిశుభ్రమైన తాగునీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఈ పనులను పూర్తి చేసిన తర్వాత గ్రామ పంచాయతీలు నిర్వహణ బాధ్యతలు చేపడతాయని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : అమరావతికి ఏం కాదు.. అవి తప్పుడు ప్రచారాలు: రైతులు