ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఈనెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. వారోత్సవాల విజయవంతానికి మావోయిస్టులు సరిహద్దు గ్రామాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆగస్టు మూడు వరకూ జరగనున్న ఈ వారోత్సవాల్లో అమరవీరుల సంస్మరణ స్తూపాలు నిర్మించి నివాళి అర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వారోత్సవాలను భగ్నం చేసేందుకు పోలీసులు సరిహద్దుల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు.
విప్లవోద్యమంలో అసువులు బాసిన మావోయిస్టులకు ఏటా జులై 28 నుంచి ఆగస్టు మూడు వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించి నివాళి అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. వారోత్సవాల్లో మావోయిస్టుల దుశ్చర్యలను అడ్డుకునేందుకు పది రోజుల ముందు నుంచే పెద్దఎత్తున బలగాలను పోలీసులు రంగంలోకి దించారు. ఇటీవల తీగలమెట్టలో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన ఆరుగురు మావోయిస్టులతో పాటు, మిలటరీ ప్లాటూన్ కార్యదర్శి కిశోర్, మరో అయిదుగురు పేరిట ఏవోబీలో భారీ స్తూపం నిర్మించినట్లు సమాచారం.
వారోత్సవాల భగ్నానికి పోలీసుల వ్యూహరచన
అమరవీరుల వారోత్సవాలను భగ్నం చేసేందుకు పోలీసులు వ్యూహరచన చేస్తున్నారు. ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల్లో సరిహద్దు పోలీసు అధికారులు సమావేశమై ఈ మేరకు చర్చించినట్లు సమాచారం. తీగలమెట్ట, ధారకొండ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకున్నారని, మరికొంతమంది మావోయిస్టులకు గాయాలయ్యాయని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో పెద్దఎత్తున బలగాలను రంగంలోకి దింపి తప్పించుకున్న మావోయిస్టులే లక్ష్యంగా గాలింపు చర్యలు నిర్వహిస్తున్నారు. సరిహద్దుల్లో పోలీసులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
ఇదీ చూడండి: