భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని షిరిడి సాయి థియేటర్లో జరిగిన అభినందన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇప్పటి వరకు 30 చిత్రాలు తీశానన్నారు. 20 చిత్రాలు వరకూ ఎన్నో విజయాలు సాధించామని తెలిపారు. కొన్నేళ్లుగా తాను తీసిన చిత్రాలు నిరాశ పరిచాయని చెప్పారు. మార్కెట్లో ప్రజాస్వామ్యం చిత్రం తనకు పూర్వ వైభవం తెచ్చిందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని.. వారసత్వ రాజకీయాలు, పార్టీ నాయకులు కలిసి దాన్ని అపహాస్యం చేశారని ఆవేదవ వ్యక్తం చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ సామాజిక స్ఫూర్తితో ఆర్.నారాయణమూర్తి చిత్రాలు తీస్తారని తెలిపారు. ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తీసే ఇలాంటి చిత్రాలను ఆదరించాలని సూచించారు.
ఇదీ చూడండి... 'ప్రాజెక్టుల్లో అంచనాలు పెంచి దోచుకున్నారు'