విశాఖ గ్యాస్ లీకేజీకి కారణమైన ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమపై హైకోర్టు కీలక ఉత్తర్వలు జారీ చేసింది. దుర్ఘటనకు కారణమైన పరిశ్రమను సీజ్ చేయాల్సిందిగా పోలీసులను అదేశించింది. ఈనెల 23న జారీచేసిన మధ్యంతర ఉత్తర్వుల ప్రతిని అందుకున్న పోలీసులు...ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ ప్రాంగణాన్ని మూసివేసినట్లు ప్రకటించారు. సంస్థ డైరెక్టర్లు సహా...ఎవరూ పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు వీల్లేదంటూ కీలక తీర్పు వెలువరించింది. విచారణ కమిటీ పరిశ్రమలోకి వెళ్లి పరిశీలించవచ్చన్న న్యాయస్థానం....తప్పకుండా రిజిస్టర్‌లో వివరాలు నమోదు చేయాల్సిందిగా సూచించింది. కోర్టు అనుమతి లేకుండా సంస్థకు చెందిన స్థిర, చర ఆస్తులను తరలించడానికి వీళ్లేదని....డైరెక్టర్లు దేశం విడిచి వెళ్లడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. తమ అనుమతి లేకుండా వారి పాసుపోర్టులు విడుదల చేయవద్దని అధికారులను ఆదేశించింది.
లాక్‌డౌన్ కాలంలో సంస్థను పున: ప్రారంభించేందుకు అనుమతులు పొందారా లేదా అన్నది వివరణ ఇవ్వాలని సంస్థను కోర్టు ఆదేశించింది. అనుమతులు పొందకపోతే దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గ్యాస్ లీకేజీపై ఎన్జీటీ సహా వివిధ కమిటీలు నియమించిన నేపథ్యంలో ఏ కమిటీ ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తుందో నిర్ణయించుకునే అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది.
కేంద్ర పర్యావరణశాఖ నుంచి అనుమతులు పొందకుండా ఎల్జీ పాలిమర్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంశంపై వివరణ ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది. ఈనెల 26 నాటికి పూర్తి వివరాలతో నివేదిక దాఖలు చేయాలని ఆదేశిస్తూ.... విచారణను ఈనెల 28కి హైకోర్టు వాయిదా వేసింది .
ఇదీ చదవండి: