చలి కారణంగా ఆస్తమా సమస్య తీవ్రతరమై విశాఖలోని గాజువాక ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడు... ఇటీవల కేజీహెచ్ క్యాజువాల్టీ విభాగానికి అర్ధరాత్రి వేళ వచ్చారు. అతనికి ప్రాథమిక వైద్యం అందించి ఆసుపత్రి అత్యవసర విభాగానికి తరలించారు. సకాలంలో చికిత్స అందడంతో బాధితుడు కోలుకున్నారు. ఆస్తమా, న్యుమోనియా వంటి లక్షణాలతో పిల్లల వార్డుకు వచ్చే బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఆక్సిజన్, వెంటిలేటర్ వంటి పరికరాలతో బాధితులకు వైద్యం అందిస్తున్నారు.
రానున్న కొద్దిరోజులు చలి తీవ్రత అధికంగా ఉండనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. శీతల గాలులు వీయడం, మంచు అధికంగా పడుతుండడంతో జలుబు, దగ్గు, ఆస్మా, బ్రాంకైటీస్, కీళ్ల నొప్పులు, చర్మం పొడిబారి పగుళ్లు ఏర్పడడం, పొలుసు వ్యాధి విజృంభించడం, ఛాతిలో నెమ్ము చేరడం వంటి అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
వార్డులో రోగుల రద్దీ
- ప్రస్తుతం ఆస్తమా, జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో రోజుకు కేజీహెచ్ ఓపీ విభాగాలకు 20 మంది బాధితులు వస్తున్నారు.
- గత రెండు నెలల వ్యవధిలో వెయ్యి మందికి పైగా చికిత్సకు వచ్చారు. నవంబరులో 400 వందల మంది ఉంటే, డిసెంబరులో 600 మంది వరకు ఉన్నారు.
- కేజీహెచ్ రాజేంద్రప్రసాద్, భావనగర్ వార్డుల్లోని ఏడు బ్లాకులు బాధితులతో కిక్కిరిసి ఉన్నాయి. పడకలు సైతం సరిపోవడం లేదు.
- అత్యధిక శాతం మంది న్యుమోనియా, ఆస్తమా, జ్వరాలతో బాధపడుతున్నారు. గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి చూడలేదని ఒక వైద్యాధికారి పేర్కొన్నారు.
- కేజీహెచ్ మెడిసిన్ విభాగంలో సీనియర్ వైద్యులు, జూనియర్ వైద్యులు కలిపి 50 మంది వరకు అందు బాటులో ఉన్నారు. బాధితులకు అవసరమైన ఔషధాలు ఉన్నాయి.
- చర్మ సంబంధిత సమస్యలతో వచ్చే బాధితుల సంఖ్య కూడా పెరిగింది. కేజీహెచ్ చర్మవ్యాధుల ఓపీ విభాగానికి రోజుకు 20 మంది వరకు రోగులు వస్తున్నారు.
చర్మాన్ని.. పొడిబార నీయొద్ధు
శీతాకాలంలో చర్మ సంబంధిత సమస్యలు పిల్లలు, వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. పొలుసు (సొరియోసిస్)తో బాధపడే వారు జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు చర్మం పొడి బారకుండా చూసుకోవాలి. కొబ్బరి నూనె చర్మానికి రాస్తే మేలు. పొడి బారడం వల్ల దురదలు వస్తాయి. కీళ్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ తరహా ఇబ్బందులతో కేజీహెచ్‌కు వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. బాధితులు చలిగాలులకు లోనవకుండా చూసుకోవాలి. చర్మంపై పగుళ్లు ఏర్పడితే ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయని గుర్తించాలి.
- డాక్టర్ బి.బాలచంద్రుడు, విశ్రాంత చర్మవ్యాధుల విభాగాధిపతి, కేజీహెచ్
పెరుగుతున్న... ఫ్లూ బాధితులు
చలితీవ్రత హెచ్చడంతో ఫ్లూ బాధితులు పెరుగుతున్నారు. పలువురు శ్వాసకోస సంబంధిత ఇబ్బందులతో వస్తున్నారు. ఆస్తమా, బ్రాంకైటీస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇవన్నీ కొవిడ్ లక్షణాలను పోలి ఉంటున్నాయి. శీతాకాలంలో వచ్చే ఫ్లూ రెండురోజులకు మించి ఉండదు. సకాలంలో వైద్యం తీసుకుంటే వెంటనే తగ్గిపోతుంది. ఇవి రాకుండా ఫ్లూ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది.
- డాక్టర్ ఎస్‌ఎన్‌ఆర్ నవీన్, సహాయ ప్రొఫెసరు, మెడిసిన్ విభాగం, కేజీహెచ్
ఇదీ చదవండి: 'కొవాగ్జిన్, కొవిషీల్డ్ 100 శాతం సురక్షితం'