Janasena Corporators Allegations on GVMC Mayor: జీవీఎంసీ వార్డు కార్పొరేటర్ల కనీస అనుమతి లేకుండా కోట్ల రూపాయల పనులకు జీవీఎంసీ నగర్ మేయర్ అనుమతులు మంజూరు చేయడం శోచనీయమని జనసేన కార్పొరేటర్లు విశాఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 19వ తేదీన కౌన్సిల్ సమావేశం జరగనుండగా ఇప్పటికీ సుమారు 160 కోట్ల రూపాయల రోడ్ల మరమ్మతుకు అనుమతులు మంజూరు చేయడం పట్ల జనసేన, టీడీపీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు రియల్ ఎస్టేట్ వెంచర్లకు రోడ్లు వేసే దురుద్దేశంతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్ల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వందల కోట్ల రూపాయల పనులకు అనుమతులు ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు.
నగర మేయర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని తమ పార్టీ అనుయాయులకు లాభం చేకూర్చే పనులు చేయడం సమంజసం కాదన్నారు. ఈ నెల 19న జరగనున్న కౌన్సిల్ సమావేశంలో వీటన్నింటిపై ప్రశ్నించి వైసీపీ అక్రమాలను బయటపెడతామని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తెలిపారు. అంతెకాకుండా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై పీతల మూర్తి యాదవ్ ఎప్పటికప్పుడు ఎండగడూతూనే ఉన్నారు. ఇటీవల జీ 20 సదస్సులో సుందరీకరణ పేరుతో వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాల గురించి ఆ తరువాత విశాఖలో వైసీపీ నేతలు చేస్తున్న భూ అక్రమాల గురించి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా జీవీఎంసీ వైలీపీ నేతలతో కలిసి చేస్తున్న అక్రమాలపై పలు రకాల ఆరోపణలు చేశారు.
Jana Sena Leaders Protest Against Jagan comments on Pawan: ఇటీవల సామర్లకోట సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యల చేసిన జగన్‌పై జనసేన నేతలు విరుచకుపడుతున్నారు.తాజాగా జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ విశాఖలో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ప్రజల డబ్బుతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజా సంక్షేమ పథకాల గురించి మాట్లాడకుండా పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయడం సమంజసం కాదని జనసేన పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేస్తూ జీవీఎంసీ గాంధీ పార్క్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పదే పదే పవన్ కల్యాణ్ భార్యల గురించి మాట్లాడడం ఆడవాళ్లను కించపరచడమేనని ఆవేదన వెలిబుచ్చారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆడవారికి గౌరవం ఇవ్వని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎందుకని ప్రశ్నించారు. త్వరలోనే ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ది చెప్తారని అన్నారు.