ఆదివాసీ రైతులు పండించే ఉద్యాన, సుగంధ ద్రవ్య పంటలకు అంతర్జాతీయ మార్కెటింగ్ కల్పిస్తామని నర్సీపట్నంలోని ఆ విభాగ సహాయ సంచాలకురాలు అనురాధ తెలిపారు. ఉద్యాన శాఖ, ధింసా ఆర్గానిక్ రైతుల ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ సహకారంతో జీకేవీధి మండలం పారికెలు గ్రామంలో చేస్తున్న పసుపు సాగును ఆమె పరిశీలించారు. దీర్ఘకాల పంటగా పసుపు వేస్తే నష్టపోవాల్సివస్తుందని పేర్కొన్నారు. స్వల్పకాలిక రోమా, ప్రగతితోపాటు దేశవాళీ రకాలను శాస్త్రీయపద్ధతుల్లో పండిస్తే అధిక దిగుబడి సాధించవచ్చన్నారు.
పసుపు, కాఫీ, మిరియాలు, చిరుధాన్యాలు, రాజ్మాల్లో నాణ్యమైన దిగుబడులు పొందడానికి ఉద్యానశాఖ, ధింసా సంస్థ పూర్తి సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. రైతులకు రాయితీపై మినీ ట్రక్టర్లు, బాయిలర్లు, పాలిషర్, పవర్ టిల్లర్ల పంపిణీ చేస్తామన్నారు. గోదాంల నిర్మాణంలో 75 శాతం ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. పీపీఏ-ఐడీహెచ్ ప్రాజెక్టులో భాగంగా ఔషధ మొక్కల సాగుకు అనుకూల వాతావరణ పరిస్థితుల కోసం పరిశీలించారు.
ఇదీ చదవండి: నేడు.. వైఎస్సార్ గిరిజన వైద్య కళాశాలకు సీఎం శంకుస్థాపన