విశాఖ విమానాశ్రయం కేంద్రంగా అనూహ్య పరిణామం చోటుచేసుకుంటోంది. అంతర్జాతీయ విమానాలు లేని కారణంగా తమకు తీవ్ర నష్టాలొస్తున్నాయని, తమ కార్గో సేవలను ఈ విమానాశ్రయం నుంచి రద్దు చేసుకుంటున్నట్లు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీటీపీసీ) లేఖ రాసింది. దీంతో ఈ సేవలను ఆపేందుకు ఆ సంస్థ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. విశాఖకు కొవిడ్ మొదటి లాక్‌డౌన్ నుంచి అంతర్జాతీయ విమానాలను పూర్తిగా ఆపేశారు. ఇప్పటిదాకా వాటి రాకపోకలకు సంబంధించిన ఎలాంటి సమాచారం లేదు. 2017 నుంచి ఏపీటీపీసీ తరఫున గుజరాత్ స్టేట్ ఎక్స్‌పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ (జీఎస్‌ఈసీ) విశాఖ విమానాశ్రయంలో కార్యకలాపాల్ని చూస్తోంది.
అంతర్జాతీయ విమానాలు తిరగని కారణంగా.. తమకు కార్గో పంపే అవకాశం రావట్లేదని, పైగా విమానాశ్రయం వారు మినహాయింపులు కూడా ఇవ్వడం లేదని ఈ రెండు సంస్థలు పేర్కొంటున్నాయి. రవాణా లేకున్నా మొదటి లాక్‌డౌన్ నుంచి నెలకు అద్దెతో కలిపి సుమారు రూ.7లక్షల ఖర్చును భరించాల్సి వస్తోందని జీఎస్‌ఈసీ ప్రతినిధి సతీష్ ‘ఈనాడు’కు తెలిపారు. మొదటి లాక్‌డౌన్ సమయంలోనే తమకు మినహాయింపులు ఇవ్వాలని లేఖ రాశామని, వారు స్పందించకపోవడంతో రెండు నెలల క్రితం తాము కాంట్రాక్టును రద్దు చేసుకుంటున్నట్లు మరో లేఖ ఇచ్చామని చెప్పారు. తమ లేఖపై ఏఏఐ స్పందన ఎలా ఉన్నా తమ సేవలను ఆపుతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇదీ చూడండి: Chandrababu Delhi tour: నేడు దిల్లీకి తెదేపా బృందం..మధ్యాహ్నం రాష్ట్రపతితో భేటీ