SP land issue in vishaka: విశాఖ నగరంలోని మధురవాడ బక్కన్నపాలెం ప్రాంతంలో గాయత్రినగర్ నుంచి సాయిప్రియ లేఅవుట్‌కు వెళ్లే దారిలో రోడ్డు మధ్యగా.. ఇనుప రేకులతో ప్రహరీ నిర్మించిన ప్రాంతంతో పాటు సమీపంలో నిర్మించిన కల్వర్టు పరిసరాలను అధికారులు పరిశీలించారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మురుగు కాలువపై అనధికారికంగా కల్వర్టు నిర్మించి అక్కడి నుంచి తన స్థలం మీదుగా రోడ్డు వేయడానికి ప్రయత్నించారని.. ఇంటెలిజెన్స్ ఎస్పీ మధు ఆరోపించిన సంగతి తెలిసిందే. కలెక్టర్ మల్లికార్జున ఆదేశాలతో సోమవారం ఉదయం రెవెన్యూ, జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ అధికారులు సంయుక్తంగా ప్రాథమిక విచారణ ప్రారంభించారు.
‘భూవివాదంపై మీడియాలో కథనాలు వచ్చినందున విచారణ చేపట్టాం. రేకులతో ప్రహరీ నిర్మించిన చోట వీఎంఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉందా? ఎంపీ స్థలానికి వెళ్లే దారిలో కాల్వపై నిర్మిస్తున్న కల్వర్టు అధికారికమా? అనధికారికమా? వంటి వివరాలు తెలుసుకుంటున్నామని.. విశాఖ గ్రామీణ తహసీల్దార్ రామారావు అన్నారు.
నీటిపారుదల శాఖ అధికారులతోనూ మాట్లాడి పూర్తి నివేదికను రెండు రోజుల్లో కలెక్టరుకు సమర్పిస్తాం. ఎస్పీ మధుకు 168 గజాల స్థలాన్ని విక్రయదారు ఎలా అమ్మారు.. సంబంధిత డాక్యుమెంట్లు ఏవీ అన్నది పరిశీలించిన తర్వాతే స్పష్టత వస్తుంది’ అని పేర్కొన్నారు. మరోవైపు గాయత్రినగర్‌లోని చంద్రశేఖర్ లేఅవుట్ పరిసరాల్లో అనుమతుల్లేకుండానే కొత్తగా కల్వర్టు ఎందుకు నిర్మిస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
SP alligations on MP: విశాఖ నగరం మధురవాడ బక్కన్నపాలెం ప్రాంతంలో గాయత్రి నగర్ నుంచి సాయిప్రియ లేఅవుట్‌కు వెళ్లే మార్గంలోని రోడ్డును మూసేసి, దాని మధ్యలో ఇనుప రేకులతో ప్రహరీ నిర్మించడం వివాదాస్పదమవుతోంది. ఈ రోడ్డుకు బదులుగా మురుగు కాలువపై అనుమతి లేకుండానే కల్వర్టు నిర్మించారు. దానికి ఆనుకుని ఉన్న తన స్థలంలో నిర్మాణ పనులు చేపట్టగా ఎంవీవీ వెంచర్స్‌కు చెందిన మనుషులు అడ్డుకుని బెదిరింపులకు పాల్పడ్డారంటూ.. ఇంటెలిజెన్స్ ఎస్పీ మధు ఆరోపించారు.
సంబంధిత కథనం:
SP alligations on MP: నా స్థలాన్నీ కాజేయాలని చూస్తున్నారు... ఎంపీపై ఇంటెలిజెన్స్ ఎస్పీ ఆరోపణలు..!