విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనకు ఏల్జీ పాలిమర్స్ సంస్థ, ప్రభుత్వ విభాగాలు రెండూ కారణమని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ రీసర్చ్ & ఎకాలజీ బ్యాలెన్స్ (ఇన్స్వారెబ్-INSWAREB) సంస్థ పేర్కొంది. ప్రస్తుతం పరిస్థితులను చక్కదిద్దటానికి రెండే మార్గాలున్నాయని... ఒకటి స్థానికులకు వేరేచోట వసతి కల్పించడం, పరిశ్రమను వేరేచోటుకు మార్చటమేనని స్పష్టం చేశాయి. ప్రస్తుతం ప్రజలు ఆవేదనతో ఉన్నారని.. పరిశ్రమ నడపటానికి ఒప్పుకోరని.. ఏల్జీ పాలిమర్స్‌ను వేరేచోటుకు మార్చటమే సరైన మార్గమని సూచించింది. ఇన్స్వారెబ్ విడుదల చేసిన నివేదికలో ఈ రకంగా పేర్కొంది.
- గ్యాస్ లీకేజిపై యాజమాన్యం చాలా రకాల కారణాలు చెప్తోంది. రిఫ్రిజిరేటర్లు పాడైనందున...20 డిగ్రీల ఉష్ణోగ్రతను నిర్వరించలేకపోయామని.. పరిశ్రమ తెరిచి చాలా రోజులు అయినందున.. ఉష్ణోగ్రతల్లో తెడాలు వచ్చాయని చెప్తున్నారు.
- ఘటన జరిగి ఇన్ని రోజులైనా యాజమాన్యం.... గ్యాస్ లీక్‌పై కారణాలు బయటకు చెప్పలేదు. తీసుకుంటున్న చర్యలపైనా మీడియాకు తెలియజేయలేదు.
- పరిశ్రమల ఇన్స్పెక్టర్ లాక్డౌన్ సమయంలో మార్గదర్శకాలు జారీ చేయాల్సింది. బాయిలర్లు, నిల్వ ఉన్న విషమూలకాల నిర్వహణకు ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించాల్సింది. అది జరగలేదు.
- ఇలాంటి ప్రమాదకరమైన రసాయనాలు నిల్వ ఉన్నప్పుడు... ప్రభుత్వం 3 నుంచి 5 కిలోమీటర్ల దూరం విస్తరణలో నివాసితులకు అనుమతి ఇవ్వకూడదు. పరిశ్రమల ఇన్స్పెక్టర్, పీసీబీ ఈ నిబంధనలు అమలు చేయడంలో, ప్రభుత్వానికి జరిగే పరిణామాలపై హెచ్చరించడంలో విఫలమయ్యారు.
- పట్టణ అభివృద్ధి సంస్థ ప్రమాద ప్రాంతంలోని లేఅవుట్లను ఆమోదించకూడదు
- రెడ్ జోన్లలో జీవీఎంసీ భవన ప్రణాళికలను ఆమోదించకూడదు.
- 1961, 2020 మధ్యలో పరిశ్రమ చూట్టూ ఉన్న స్థలం దుర్వినియోగం అయ్యింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎలాంటి పరిష్కారం చూపిస్తారు?
- ఫ్యాక్టరీ విస్తరణపై పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) అధ్యయనం చేసిందా? ఒకవేళ అధ్యయనం జరిగి ఉంటే.. 'బోగస్'గా ఎందుకు పరిగణించలేదు?
- వీటన్నిటిపైనా కమిటీ అధ్యయనం చేయాల్సి ఉంది. ఈ ఉపద్రవానికి ఎవరు కారణమో బయటకు తీసుకురావాల్సి ఉంది.
- దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా.. సంస్థ లోపాలు, ప్రభుత్వ సంస్థల వైఫల్యాలు బయటకు తీసుకురావాల్సి ఉంది.
ఇదీ చదవండి : రైళ్లలో వారు ఊరెళ్లడం ఇక మరింత ఈజీ