ప్రమాద సమయంలో సిబ్బంది తప్పించుకున్నారా?
* మూడు విడతల్లో.. ఒక్కొక్క విడతలో 15 మంది చొప్పున నిర్వహణ పనుల కోసం హాజరుకావాలని పరిశ్రమల శాఖ సూచించింది. ఈ క్రమంలో సంస్థ గత రెండు రోజుల నుంచి నిర్వహణ పనులను చేపట్టింది. వాటిని కొద్ది రోజుల్లో పూర్తి చేసి.. ఉత్పత్తిలోకి వెళ్లాలన్న ఆలోచనలో ఉండగా ఈ ప్రమాదం సంభవించింది.
* ఇదే దుర్ఘటన ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత జరిగినట్లయితే ప్రమాద తీవ్రత భారీగా ఉండి సిబ్బంది ప్రాణనష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉండేదని పరిశ్రమలశాఖ అధికారులు భావిస్తున్నారు.
వివరాల సేకరణలో..
నిర్వహణ పనుల కోసం వచ్చిన సిబ్బంది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. పరిశ్రమలో పనిచేస్తున్న సిబ్బంది దుర్ఘటన కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు ఇప్పటి వరకు ‘ఎల్‌జీ’ సంస్థ పేర్కొనలేదు. దీన్నిబట్టి ప్రమాదాన్ని పసిగట్టిన వెంటనే సిబ్బంది అక్కడి నుంచి బయటకు తప్పించుకుని ఉంటారని పరిశ్రమలశాఖ భావిస్తోంది. నిర్వహణ పనుల కోసం హాజరైన సిబ్బంది వివరాలను పరిశ్రమల శాఖ సేకరిస్తోంది.
* పరిశ్రమలో శాశ్వత ప్రాతిపదికన 363 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మరో 70 మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.
స్వీయ పాలిమరైజేషన్‌తోనే ప్రమాదం
విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్ ఇండియా(ప్రై) లిమిటెడ్‌లో ద్రవ రూప స్టైరిన్ ట్యాంకుల వద్ద లాక్‌డౌన్ సమయంలో స్వీయ రసాయనచర్య(పాలిమరైజేషన్) జరిగే లీకేజీ ఏర్పడిందని పరిశ్రమల శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆ శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను గురువారం పంపారు. దుర్ఘటనకు దారితీసిన కారణాలను అందులో వివరించారు.
నివేదికలోని అంశాలు
* స్టైరిన్‌ను 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత దగ్గర నిల్వ చేయాలి. నిల్వ చేసిన ట్యాంకుల దగ్గర కచ్చితంగా పాటించాల్సిన ఉష్ణోగ్రతలు నియంత్రణలో లేక ద్రవరూపంలో ఉన్న రసాయనం ఆవిరి అయ్యింది. 2 వేల మెట్రిక్ టన్నుల స్టైరిన్ నిల్వ సామర్థ్యం ఉన్న ట్యాంకులు సంస్థ ఆవరణలో ఉన్నాయి.
* గురువారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఆకస్మికంగా ద్రవ రూపంలో ఉన్న స్టైరిన్‌ను నిల్వ చేసిన ట్యాంకుల నుంచి లీకేజీ ఏర్పడి అకస్మాత్తుగా పొగల రూపంలో కమ్ముకుంది. గాఢమైన గ్యాస్ వాసన సమీపంలోని అయిదు గ్రామాలపై ప్రభావం చూపింది.
* ప్రమాదానికి దోహదమైన సాంకేతిక లోపాలపై ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారి పూర్తి స్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలి.
* పర్యావరణ ప్రభావ మదింపు(ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్/ఈఐఏ) నిబంధనలు 2006 నుంచి అమల్లోకి వచ్చాయి. 1968లోనే పరిశ్రమ ఏర్పాటైనందు వల్ల ఈ సంస్థకు పర్యావరణ అనుమతులు అవసరం లేదు.
ఇవీ చూడండి...