Industrial situation in AP: విశాఖ వైఎస్సార్సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఏపీలో వ్యాపారం చేయలేను.. హైదరాబాద్‌కు వెళ్లిపోతానని ఎంత స్పష్టంగా చెప్పారో. ఏపీలో వ్యాపారం చేయలేనంటే.. ఈయనెవరో విపక్ష పార్టీకి చెందిన నేత అనుకునేరు. స్వయనా అధికార పార్టీకి చెందిన ఎంపీ. అది కూడా జగన్ స్వయంగా పాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈయన. ఎన్నో ఏళ్లుగా బిల్డర్‌గా విశాఖలో వ్యాపారం చేస్తున్నారు. పైగా అధికార పార్టీ ఎంపీ. మరి ఈయనే నేను తెలంగాణకు వెళ్లిపోతానని తేల్చిచెప్పడం.. వైఎస్సార్సీపీ పాలనలో పారిశ్రామికవేత్తలకు ఎలాంటి వేధింపులు ఎదురవుతున్నాయో స్పష్టమవుతోంది.
- ALSO READ: సత్తా ఉంటే పరిశ్రమను వెనక్కి తీసుకురావాలి
వైఎస్సార్సీపీ నేతల వేధింపులు, వసూళ్ల పర్వం.. 2019 మే నెలాఖరున సీఎంగా జగన్ ప్రమాణం చేశారు. గత ప్రభుత్వ హయాంలో లక్షల కోట్లలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్న వారిలో.. ఆందోళన ప్రారంభమైంది. అలాంటి సమయంలో వారికి భరోసా ఇవ్వాల్సిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దలు.. వేధింపులనే పనిగా పెట్టుకున్నారు. మొదటగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కియా పరిశ్రమపై పడ్డారు. 2 వేల 500 కోట్లతో అనుబంధ పరిశ్రమలు పెట్టేందుకు వచ్చిన ఆ సంస్థను.. అధికార పార్టీ ఎంపీ భయపెట్టారు. చేసేదిలేక రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయి. దీంతో పారిశ్రామికవేత్తల్లో ఆందోళన మరింత పెరిగింది. ఆ తర్వాత అదే జిల్లాలోని జాకీ పరిశ్రమపై వైఎస్సార్సీపీ నేతల కన్ను పడింది. వసూళ్ల కోసం వేధించడంతో.. 6వేల మందికి ఉపాధి కల్పించాల్సిన ఆ పరిశ్రమ సైతం తెలంగాణకు వెళ్లిపోయింది.
ఐటీ పరిశ్రమలకు ప్రోత్సాహం సున్నా.. ఇక ఐటీ పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వకపోవడంతో .. విశాఖలో ఎప్పటి నుంచో ఉన్న హెచ్ఎస్బీసీ, ఐబీఎం సంస్థలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. సుమారు 100 అంకుర సంస్థల్ని మూసేశారు. దీంతో వేలాది మందికి వైఎస్సార్సీపీ సర్కార్ ఉపాధిని దూరం చేసింది. విభజన తర్వాత రాజధానిగా అమరావతిని ప్రకటించడంతో దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో స్థిరాస్తి రంగం ఊపందుకుంది. వేలాదిగా అపార్ట్‌మెంట్లు, ఇతర నిర్మాణాలు చేపట్టారు. దీనిమీదా కక్షకట్టిన ప్రభుత్వం.. అమరావతిని మూలనపడేసి 3 రాజధానులను తెరపైకి తెచ్చింది. ఫలితంగా నమ్మకం కోల్పోయిన అనేకమంది స్థిరాస్తి వ్యాపారులు, కొనుగోలుదారులు.. రాష్ట్రం నుంచి తెలంగాణ వైపు దృష్టిసారించారు. మొత్తంగా నాలుగేళ్లుగా పారిశ్రామిక పరంగా ఏపీకి వైఎస్సార్ సీపీ సర్కార్ చేసిన అన్యాయాన్ని, మోసాన్ని, నష్టాన్ని.. సొంత పార్టీ ఎంపీ మాటలే మరోసారి రుజవుచేశాయి.
- ALSO READ: పరిశ్రమలు వచ్చేనా.. ఉద్యోగాలు దొరికేనా..
పక్క రాష్ట్రాలకు క్యూ కట్టిన పరిశ్రమలు..
- తిరుపతిలో 150 ఎకరాల్లో 52వేల కోట్ల పెట్టుబడితో ఎలక్రానిక్ పార్క్ ఏర్పాటుకు 2018లో ఒప్పందం చేసుకున్న రిలయన్స్.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనను విరమించుకుంది.
- భారీ ఎత్తున విశాఖలో డేటా సెంటర్ పెట్టేందుకు కుదుర్చుకున్న ఒప్పందాన్ని.. అదానీ సంస్థ కుదించుకుంది.
- 2వేల కోట్లతో విశాఖలో దేశంలోనే అతిపెద్ద మాల్‌ను ఏర్పాటు చేస్తామన్న లులూ సంస్థ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం భూములని వెనక్కి తీసుకోవడంతో చేసేదిలేక తమిళనాడుకు వెళ్లిపోయింది.
- పర్యావరణ సాకులు చూపుతూ ఎన్నో ఏళ్లుగా వేల మందికి ఉపాధి కల్పిస్తున్న అమరరాజా సంస్థను.. ప్రభుత్వం వేటాడింది. దీంతో ఆ సంస్థ తన భవిష్యత్ విస్తరణలో భాగంగా రాష్ట్రంలో చేపట్టాల్సిన పరిశ్రమను.. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు మార్చేసింది.
- ప్రస్తుత నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంలో కాగితపు పరిశ్రమ పెట్టేందుకు ఆసియన్ పల్ప్, పేపర్ మేనేజ్‌మెంట్ 26 వేల 500 కోట్లతో ముందుకొచ్చింది. ఇది సాకారమై ఉంటే సుబాబుల్, జామాయిల్ రైతుల కష్టాలు తీరేవి. యథావిధిగా ప్రభుత్వ పెద్దల తీరుతో.. ఈ సంస్థ సైతం ఏపీకి బైబై చెప్పింది.