విశాఖపట్నం సమీపంలో 30 ఎకరాల్లో రాష్ట్ర అతిథిగృహం నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇందుకు ఎంపిక చేసిన స్థలం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కాపులుప్పాడ గ్రామ పరిధిలో ప్రస్తుతం గ్రేహౌండ్స్ బెటాలియన్, కార్యాలయం నిర్వహిస్తున్న ప్రాంతంలో కొండపై 30 ఎకరాల్లో అతిథిగృహం నిర్మించడానికి.. ఆకృతుల రూపకల్పన, ఇతరత్రా అంశాలపై ఆసక్తి ఉన్న వారి నుంచి విశాఖపట్నం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) దరఖాస్తులను ఆహ్వానించింది.
అయితే ఆ ప్రాంతం పురావస్తుశాఖ పరిధిలో ఉందని, బౌద్ధస్తూపాలతో చారిత్రక ప్రాధాన్యమున్న ఆ కొండలపై భారీ కట్టడాలు నిబంధనలకు విరుద్ధమంటూ పలువురు.. ఉన్నతాధికారులకు లేఖలు రాయడం చర్చనీయాంశంగా మారింది.
విశాఖపట్నం సమీపంలోని కాపులుప్పాడ గ్రామ సమీపంలో దాదాపు 44 సంవత్సరాల క్రితం భారత నౌకాదళం ఏరియల్ సర్వే చేస్తుండగా తొట్లకొండ ప్రాంతంలో నిర్మాణాలున్నట్లు గుర్తించారు. పురావస్తు అధికారులు పరిశోధించి తొట్లకొండపై బౌద్ధ స్తూపాలను గుర్తించారు. మున్ముందు తవ్వకాలు జరిపితే మరిన్ని బయటపడొచ్చనే ఉద్దేశంతో తొట్లకొండ, పరిసర కొండలతో కలిపి 3,300 ఎకరాలను పురావస్తు సంపదగా 1978లోనే అధికారికంగా నోటిఫై చేశారు. ఇందుకోసం ఆ భూమినంతటినీ 314 (పాత) సర్వే నంబరు కింద ప్రత్యేకంగా గుర్తించారు. 1960 చట్టం ప్రకారం ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా, భూములను ఇతర అవసరాలకు ఉపయోగించినా నేరం. అయితే కాలక్రమేణా రెవెన్యూ అధికారులు ఆ ప్రాంతాన్ని సబ్‌డివిజన్ చేసి ప్రభుత్వ అవసరాలకు, ఇతర అవసరాలకు ఉపయోగిస్తూ వచ్చారు. తొట్లకొండను ఆనుకుని గ్రేహౌండ్స్‌కు కూడా భూమి కేటాయించారు. గ్రేహౌండ్స్‌కు కేటాయించిన కొండపై రాష్ట్ర అతిథిగృహాన్ని భారీ స్థాయిలో నిర్మించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. భారీ నిర్మాణాలకు, ఇతర అవసరాలకు ఆ భూములను ఉపయోగించడం వల్ల పరిసర ప్రాంతాల్లోని చారిత్రక సంపద మరుగునపడిపోతుందని చరిత్రకారులు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- తవ్వకాలు జరిపితే బయటపడతాయి
తొట్లకొండ ప్రాంతంలో ఏడెకరాల్లో బౌద్ధ స్తూపాలున్నట్లు ఇప్పటివరకు గుర్తించారు. దీని పరిధిని 120 ఎకరాలుగా గుర్తించి చుట్టూ కంచె వేశారు. కంచె దాటి తవ్వకాలు జరిపితే మరిన్ని బౌద్ధ స్థావరాలు బయటపడే అవకాశం ఉందని చరిత్రకారులు పేర్కొంటున్నారు. పురావస్తు శాఖకు కేటాయించిన 3,300 ఎకరాలతో పాటు దాని తరువాత మరో 300 మీటర్ల వరకు ఉన్న ప్రాంతాన్ని సంరక్షించాలని, ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా నిషేధించాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని వారు అంటున్నారు. రెవెన్యూ అధికారులు మాత్రం పురావస్తుశాఖకు ప్రస్తుతమున్న 120 ఎకరాలే తొట్లకొండ పరిధి అని, మిగిలిన ప్రాంతమంతా ప్రభుత్వ భూమి కిందే వస్తుందని చెబుతున్నారు. ప్రభుత్వ భూమి అనడానికి ఎటువంటి ఉత్తర్వులు లేవని, దీనిపై చట్టసవరణ తీసుకురావాలని ప్రయత్నించినా నేరమని బౌద్ధ సంఘాలు పేర్కొంటున్నాయి. గతంలో వీఎంఆర్‌డీఏ అధికారులు బొటానికల్ గార్డెన్ ఏర్పాటు కోసం ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టగా చరిత్రకారులు, పర్యావరణవేత్తలు వాటిని అడ్డుకున్నారు. ఆ తరువాత పర్యాటకాభివృద్ధి సంస్థ చేపట్టే పనులపై హైకోర్టులో 2016లో కేసు వేశారు. పనులు నిలిపేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం మరో కేసు కొనసాగుతోంది.
- తొట్లకొండపై పరిశోధన
అమెరికాకు చెందిన లార్స్ ఫోగ్లిన్ అనే ఆంత్రోపాలజిస్టు 20 ఏళ్ల క్రితం తొట్లకొండపై ఉన్న బౌద్ధ స్తూపాలపై పరిశోధన చేశారు. దీనిపై ఒక పరిశోధన గ్రంథాన్ని ప్రచురించారు. ప్రస్తుతం ఉన్నవి కాకుండా మరో 120 వరకు బౌద్ధ స్థావరాలు ఉండొచ్చని ఫోగ్లిన్ అందులో పేర్కొన్నారు.
ఇక్కడ నిర్మాణాలొద్దని నిరంతరం పోరాడుతున్నాం
తొట్లకొండ పరిసర ప్రాంతాల్లో తవ్వకాలు జరిపితే మరిన్ని బౌద్ధ స్థావరాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే అప్పట్లో అన్ని ఎకరాలను నోటిఫై చేశారు. ఇక్కడ నిర్మాణాలు చేపడితే పురావస్తు సంపదను కోల్పోతాం. ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని హైకోర్టు ఉత్తర్వులున్నాయి. గ్రేహౌండ్స్, ఇతర సంస్థలకు అక్కడ స్థలాలు కేటాయించడంపై పోరాడుతున్నాం. పురావస్తుశాఖ పరిధిలోని స్థలంపై ప్రభుత్వ జోక్యం తగదు.- ఈఏఎస్ శర్మ, సీనియర్ విశ్రాంత ఐఏఎస్ అధికారి
ఆ భూమి ప్రభుత్వానిదే
రాష్ట్ర అతిథిగృహానికి గుర్తించిన స్థలం ప్రభుత్వానిదే. పోలీసుశాఖకు లోగడ ఇక్కడ 300 ఎకరాలు కేటాయించారు. ఆ స్థలంలోనే అతిథిగృహం నిర్మించటానికి గుర్తించాం. తొట్లకొండతో దీనికి సంబంధం లేదు. అవన్నీ వేర్వేరు కొండలు. ప్రభుత్వ భూమి అయినందునే ముందుకెళ్లాం.
- వినయ్‌చంద్, విశాఖ జిల్లా కలెక్టర్
ఇదీ చూడండి. సిబ్బంది మాట్లాడరు.. మందులివ్వరు.. సొంత వైద్యంతో అనర్థాలు