HC ON DASAPALLA LANDS : విశాఖలోని దసపల్లా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన మెమోను 15 రోజుల్లో అమలు చేయాలని ఆ జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తి జస్టిస్ సుజాత ఈనెల 2న ఈ మేరకు ఆదేశాలిచ్చారు. దసపల్లా భూములపై హక్కులు కల్పించాలని రాణీ కమలాదేవి 2000 సంవత్సరంలో హైకోర్టును ఆశ్రయించగా, ఆమెకు అనుకూలంగా ఉత్తర్వులిచ్చింది.
ప్రభుత్వం దాఖలుచేసిన ఎస్‌ఎల్‌పి, క్యూరేటివ్ పిటిషన్లను 2012, 2014లలో సుప్రీంకోర్టు కొట్టేసింది. మరోవైపు దసపల్లా భూములను నిషేధిత జాబితాలో చేరుస్తూ 2015లో ప్రభుత్వం ఉత్తర్వుల్చింది. వాటిని సవాలు చేస్తూ రాణీ కమలాదేవి 2016లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం ఈనెల 2న విచారణకు వచ్చింది. కమలాదేవి తరఫున న్యాయవాది ఎన్.అశ్వినీకుమార్ వాదనలు వినిపించారు.
2009నాటి హైకోర్టు తీర్పును అమలు చేసేందుకు ఏజీ సలహామేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి మెమో జారీచేశారంటూ.. దాన్ని కోర్టుకు అందజేశారు. వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి.. హైకోర్టు డివిజన్ బెంచ్ 2009లో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడం కోర్టుధిక్కరణ అవుతుందన్నారు. ఆ మెమో అమలుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
కలెక్టరుకు రాణీ కమలాదేవి వినతి: హైకోర్టు ఆదేశాలను వెంటనే అమలు చేయాలంటూ రాణీ కమలాదేవి, ఆమె కుమారుడు దిగ్విజయ్ చంద్రదేవ్ భంజ్ విశాఖ కలెక్టరుకు విజ్ఞప్తి చేశారని వారి న్యాయవాది అరుణ్‌దేవ్ తెలిపారు.
ఇవీ చదవండి: