High Court On Rama Naidu Studio Layout PIL: విశాఖలోని మధురవాడలో రామానాయుడు స్టూడియో ఏర్పాటు కోసం కేటాయించిన భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ లే అవుట్ ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘పిటిషన్ దాఖలు చేసింది ఓ ఎమ్మెల్యే.. అది ఫిల్మ్ స్టూడియో భూమి. ప్రభుత్వానిది కాదని తెలిపింది. అది పూర్తిగా ప్రైవేటు వివాదమని.. అది ధనికుల మధ్య ఫైటింగ్’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రతి ఉల్లంఘనను పిల్ రూపంలో సవాలు చేయలేరని తేల్చిచెప్పింది. ఇందులో ప్రజాహితం ఏముందని వ్యాఖ్యానించింది. ఈ కేసులో పేదల ప్రయోజనాలు ఎక్కడున్నాయంది. జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ పిల్‌ను కొట్టేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులిచ్చింది.
మధురవాడ సర్వే నంబరు 387/పిలో 15.80 ఎకరాలను రెసిడెన్షియల్ లే అవుట్‌గా మార్చేందుకు సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సమర్పించిన లే అవుట్ ప్లాన్ను ఆమోదిస్తూ ఈ ఏడాది మార్చి 2న జీవీఎంసీ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులు ఇచ్చారు. వాటిని సవాలు చేస్తూ విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ హైకోర్టులో పిల్ వేశారు. మధురవాడలోని వివిధ సర్వే నంబర్లలో రామానాయుడి స్టూడియో కోసం 34.44 ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2003 సెప్టెంబర్ 13న జీవో ఇచ్చిందన్నారు. భూ కేటాయింపు నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో సంబంధిత జీవోను రద్దు చేయాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా 15.80 ఎకారల్లో రెసిడెన్షియల్ లే అవుట్ ఏర్పాటుకు అనుమతిచ్చారన్నారు. పిటిషనర్ తరఫున న్యాయవాది టి.విష్ణుతేజ వాదనలు వినిపించారు. జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన ధర్మాసనం.. వ్యాజ్యాన్ని ఉపసంహరించుకొని ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాలని సూచించింది. న్యాయవాది ఉపసంహరణకు విముఖత తెలిపారు. తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. దీంతో పిల్‌ను కొట్టేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
జీవో 84 ఆధారిత నిర్ణయాలు తుది తీర్పునకు లోబడి: పురపాలక పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతను పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం జూన్ 24న తీసుకొచ్చిన జీవో 84ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఆ జీవో ఆధారంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఈ వ్యాజ్యంలో తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 16కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. పురపాలక పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతను పాఠశాల విద్యాశాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవో 84, తదనంతర నిర్ణయాలను సవాలు చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు ఎన్.మురళీకృష్ణ, మరొకరు ఈ ఏడాది ఏప్రిల్‌లో వ్యాజ్యం దాఖలు చేశారు.
ఇవీ చదవండి: