రేపటి నుంచి వారం రోజుల పాటు పీఎల్‌జీఏ వారోత్సవాలు జరగనున్నాయి. రెండేళ్ల క్రితం మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమలను లివిటుపుట్టు వద్ద మావోయిస్టులు కాల్చిచంపారు. దీంతో వారోత్సవాలను పోలీసులు తేలిగ్గా తీసుకోవడం లేదు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాలతో పాటు.. ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో భారీగా గాలింపు చర్యలను నిర్వహిస్తున్నారు. ఒడిశాలోని ఎస్‌వోజీ, బీఎస్ఎఫ్, డీవీఎఫ్ పోలీసు బలగాలతో పాటు ఆంధ్రాకు చెందిన గ్రేహౌండ్స్, ప్రత్యేక పార్టీ పోలీసు బలగాలు అలుపెరగకుండా ఏవోబీలో మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు.
ఏవోబీలో తోటగూడ వద్ద గత వారం జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులకు చెందిన కీలక సమాచారం లభ్యమైనట్లు తెలుస్తోంది. ఒడిశా పోలీసులు ఆంధ్రాకు చెందిన కొంతమంది అధికారులతో కలిసి ఈ సమాచారాన్ని అధ్యయనం చేస్తున్నారని.. దీనికితోడు ఈ ఎదురుకాల్పుల నుంచి మావోయిస్టు కీలక నేతలు తప్పించుకున్నారనే సమాచారంతో పోలీసు బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. దీంతో సరిహద్దుల్లో ఎప్పడు ఏమి జరుగుతుందోనని గిరిజన ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి: జానీ దర్శకత్వంలో పవన్.. నిర్మాతగా చరణ్!