విశాఖ జిల్లా పాడేరు ఘాట్ రోడ్ వ్యూ పాయింట్ వద్ద కొండచరియలు విరిగి పడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ కొండచరియ రహదారికి అడ్డంగా పడడంతో పోలీసులు జేసీబీతో తొలగించే చర్యలు చేపట్టారు. పాడేరు సబ్ కలెక్టర్ అభిషేక్ సహాయ చర్యల్లో పాల్గొన్నారు. రెవెన్యూ అధికారులు వెంటనే పోలీసులు, ఆర్అండ్బీ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. వారు రాత్రంతా కష్టపడి విరిగిపడిన కొండచరియలను తొలగించారు. రాత్రి సమయం కావడంతో ఘాట్ రోడ్లో ఎక్కడికక్కడ వందలాది వాహనాలు నిలిచిపోయాయి. సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ముందస్తుగా తాటిపర్తి, గరిక బంద, వంటల మామిడి, 12 మైళ్ల జంక్షన్ వద్ద వాహనాల్ని నిలిపివేయించారు. వాహనాలు నిలిచిపోవటంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. చివరకు అర్థరాత్రి 3గంటల సమయంలో కొండరాళ్లు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
ఇదీ చదవండీ.. పాలిసెట్ 2021 ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల..