విశాఖ మన్యంలో వర్షాలు ఏకధాటిగా కురుస్తునే ఉన్నాయి. గెడ్డలు, వాగులు వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. మారుమూల ప్రాంతంలోని పలు గ్రామాలకు రాకపోకలు స్థంభించిపోయాయి. వరిపోలాలు నీటి మునిగి మేటలు వేశాయి. విశాఖ ఏజెన్సీ పరిధిలో అల్పపీడన ప్రభావంతో గత ఆరు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. మెట్ట ప్రాంతాలు నీటమునిగాయి.
జి.మాడుగుల మండలంలోని మద్దిగరువు, కోడిమామిడి, జీకే వీధి మండలం గుమ్మిరేవుల పంచాయతీలోని కొంగపాకలు రహదారి, ధారకొండ పంచాయతీలోని డి.అగ్రహారం వంతెన మీదుగా వర్షపు నీరు ప్రవహిస్తోంది. గూడెం కొత్తవీధి లంకపాకలు, దేవరాపల్లి అసరాడ, రంపుల, పెదవలస, జెర్రిల, వీరవరం, వంచుల, ఏబులం ప్రాంతాల్లో వరి నాట్లు కొట్టుకుపోయాయి.
కొయ్యూరు మండలంలోని గెడ్డలు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో యు.చీడిపాలెం, ఎం.భీమవరం పంచాయతీల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బూదరాళ్లు పంచాయతీలో గెడ్డలు ఉదృతంగా ప్రవహిస్తున్నది. దీంతో గిరిజన గ్రామాలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఏ చిన్న అవసరం వచ్చిన వారికి గెడ్డ దాటి రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ నీటి ప్రవాహ ఉద్ధృతి కారణంగా....రాలేని పరిస్థితి. కొంతమంది అతి కష్టం మీద గెడ్డను దాటేందుకు ప్రయత్నిస్తున్నారు.