నగరంలోని జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలు దృష్ట్యా.. నివారణ చర్యలకు జీవీఎంసీ అధికార యంత్రాంగం పూనుకుంది. రూ.70లక్షలతో నగరంలోని పలు కూడళ్లను మార్చేందుకు సంకల్పించింది. ప్రమాదాలకు కారణమవుతున్నచోట రహదారుల్ని సరిదిద్దడంతోపాటుగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.
హనుమంతవాకలో జాతీయ రహదారిపై రద్దీ
హనుమంతవాక నుంచి బోయపాలెం మధ్య ఉండే అన్ని కూడళ్లను జీవీఎంసీ బాగు చేస్తుంది. కొన్నిచోట్ల రోడ్డు విస్తరిస్తున్నారు. మారికవలస అన్నాక్యాంటీన్ సమీపంలోనూ జాతీయరహదారికి మరమ్మతులు చేసి, సరి చేస్తున్నారు. కార్‌షెడ్‌కూడలిలో 30మీటర్లు, కొమ్మాదికూడలిలో 60మీటర్ల మేర ముందుకు తీసుకువస్తున్నారు. క్రికెట్ స్టేడియం సమీప కూడలిలోనూ మార్పుచేర్పులు జరుగుతున్నాయి.
ప్రణాళికలు సిద్ధం...
ఎన్‌ఏడీకొత్తరోడ్డు కూడలి దగ్గర జాతీయ రహదారి మలుపును మూసేశారు. ప్రమాదాలు జరగకుండా కాస్త దూరంగా కూడలి నిర్మాణం చేసేందుకు యోచిస్తున్నారు. ఎండాడ డబుల్ రోడ్డు విభాగినిలో మార్పులు చేపట్టింది జీవీఎంసీ. షీలానగర్ నుంచి డైరీఫామ్ మధ్య వీధిలైట్ల వెలుతురు.. జాతీయరహదారిపైకి రాకపోవడాన్ని గుర్తించి చెట్లు తొలగిస్తున్నారు. మరిన్ని ప్రమాదల నివారణకు ఉపయోగపడే పనుల్ని జాతీయరహదారిపై చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
ఏం చేయాలో అంతు చిక్కదు:
గాజువాక, మద్దిలపాలెం, హనుమంతవాక, కార్‌షెడ్ కూడళ్లలో పైవంతెనల్ని నిర్మించేందుకు ఎనిమిది నెలల్లో సవివరణ నివేదిక సిద్ధంకానుంది. దాన్ని తయారు చేసే సంస్థ ట్రాఫిక్‌సర్వే ఈ మేరకు పరిశీలన మొదలుపెట్టింది. అయితే హనుమంతవాక కూడలిలో ప్రమాదాలు పెరుగుతుండటం.. తాత్కాలిక చర్యలుగా అక్కడేం చేయాలనేది అధికారులకు అంతుచిక్కడంలేదు. ప్రమాదాలు నివారించేలా రెండేళ్ల వ్యవధిలోనే ఈ కూడలికి రూ.37లక్షలకుపైగా ఖర్చుపెట్టారు. అయినా ప్రమాదాలు తగ్గడంలేదు. పోలీసులు, రోడ్‌ట్రాన్స్ పోర్టు అథారిటీ, నిపుణులు సూచించినమేరకు పనులు చేస్తున్నట్లు జీవీఎంసీ ప్రధాన ఇంజినీరు ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. ఇవికాకుండా ఏటా రోడ్ల నిర్వహణకు రూ.50లక్షలు వినియోగిస్తున్నామన్నారు.
ఇవీ చూడండి...