విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ప్రహరీ లేక గేదెలు, పందులు కళాశాల ఆవరణలో సంచరిస్తున్నాయి. సాయంత్రం వేళ అసాంఘిక కార్యక్రమాలకు భవనం అడ్డాగా మారింది. ఎక్కడ చూసినా మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. కళాశాల నిర్మించి 15 ఏళ్లు అయినా ప్రహరీ లేదు. బయట వ్యక్తులు లోనికి వచ్చి పదేపదే అంతరాయం కలిగిస్తుంటారు. దాదాపు 200 మందికిపైగా బాలికలు ఉన్న ఈ విద్యాలయంలో కేవలం రెండే మరుగుదొడ్లు ఉన్నాయి. తాగాడానికి గుక్కెడు నీటి వసతీ లేదు. అపరిశుభ్రత.. ఇక్కడ నిత్యం మామూలే.
సరిపడా తరగతి గదులు లేక విద్యార్థులు ఆరుబయటే పాఠాలు వినాల్సిన వస్తోంది. మధ్యాహ్నం భోజనానికి పక్కనే ఉన్న పాఠశాల భవనానికి వెళ్లాల్సిందే. పాములు, కీటకాలు తరగతి గదిలోకి వస్తున్నాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
బయోమెట్రిక్ కోసం పక్క భవనానికి వెళ్లాల్సి వస్తోందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వ శిక్ష అభియాన్ ద్వారా 60 లక్షల నిధులు విడుదలైనా ప్రభుత్వం మారేసరికి ఆగిపోయాయని చెబుతున్నారు. అధికారులు, పాలకులు కళాశాల సమస్యపై దృష్టి సారించి మౌలిక వసతులు సమకూర్చాలని విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి