డీఎస్సీ 2018 సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్జీటీ) అభ్యర్థులకు తీపి కబురు అందింది. పరీక్షలు రాసిన రెండేళ్ల తరువాత నియామకాల కోసం పిలుపు రావటంతో ఆయా అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వాస్తవానికి 2019 జులై నాటికి పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. ఫలితాలు వెలువడిన తర్వాత కొందరు అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించడం... ప్రభుత్వం మారటంతో వీరి నియామక ప్రక్రియలో జాప్యం జరిగింది. వైకాపా ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ముందుగా పాఠశాల సహాయక పోస్టులను భర్తీ చేసింది. గతేడాది డిసెంబర్లో ఎస్జీటీ పోస్టులకు అర్హత సాధించిన వారి ధ్రువపత్రాల పరిశీలన చేసింది. కోర్టుల్లో కేసులు ఉండటంతో ఇన్నాళ్లు ఈ ఖాళీలను భర్తీ చేయలేకపోయారు. తాజాగా వీటికి సంబంధించిన న్యాయపరమైన వివాదాలు పరిష్కారం కావటంతో ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు అందించడానికి సిద్ధమవుతున్నారు అధికారులు.
కోర్టు తీర్పుతో ఊరట
విశాఖ జిల్లాకు సంబంధించి 634 పోస్టుల భర్తీకి 2018లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు . 2018 డిసెంబర్ 24 నుంచి 2019 జనవరి నెలాఖరు వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. వీటి కోసం సుమారు 48 వేల మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఫలితాలు వెలువడిన తర్వాత న్యాయస్థానాల్లో కేసులు దాఖలు కావటంతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. ప్రిన్సిపాల్, పీజీటీ పోస్టులను భర్తీ చేశారు. ఎస్జీటీల విషయంలో మొన్నటివరకు స్పష్టత రాకపోవటంతో వాటికి అర్హత సాధించిన అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రెండు రోజుల క్రితం కోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇవ్వటంతో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వం కూడా బదిలీలకు ముందుగానే వీరి నియామకాలను పూర్తి చేయాలని ఆదేశించటంతో అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ నెలలోనే విధుల్లోకి...!
మొత్తం 595 ఎస్జీటీ పోస్టుల్లో 97 పురపాలక పాఠశాలల్లోనూ, 94 గిరిజన సంక్షేమ శాఖలో భర్తీ చేయనున్నారు. మిగతా 404 పోస్టులకు ఎంపికైన వారిని గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాల్లో నియమించనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి గతంలోనే ధ్రువపత్రాల పరిశీలన చేపట్టగా కొంత మంది హాజరు కాలేదు. మరికొంతమంది తగిన ధ్రువపత్రాలను అందజేయలేకపోయారు. ఇలాంటి వారందరికీ రెండో విడతలో ధ్రువపత్రాలు పరిశీలించనున్నారు. సుమారు 158 మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎస్జీటీ అభ్యర్థుల ధ్రువపత్రాలకు సంబంధించి 15 బృందాలను నియమించారు అధికారులు. కరోనా నిబంధనలకు అనుగుణంగా... ఈ ప్రక్రియ ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఒక్కరోజులోనే పరిశీలన పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు అంతా ఈనెల 28 నుంచి విధుల్లో చేరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.