Posters displayed in Visakha.. Leaders removed: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గతకొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విశాఖపట్టణమేనని.. జూలై నెల నుంచి విశాఖపట్నం నుంచే పరిపాలనకు శ్రీకారం చుట్టబోతున్నామని.. పలు సమావేశాల్లో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అందుకు సంబంధించిన ఆదేశాలను కూడా ఆయన జారీ చేశారు. దీంతో అధికార యంత్రాంగం అంతా విశాఖ నుంచే పరిపాలనను కొనసాగించేందుకు అవసరమైన కార్యాలయాల కోసం వెతుకులాటను ప్రారంభించాయి. ఈ క్రమంలో ‘గో బ్యాక్ సీఎం సార్’, ‘రాజధాని అమరావతిని నిర్మించండి’ అంటూ విశాఖలో వెలిసిన పోస్టర్లు, ఫ్లెక్సీలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
‘గో బ్యాక్ సీఎం సార్’, ‘రాజధాని అమరావతిని నిర్మించండి’: సీఎం జగన్.. జులై నుంచి పరిపాలనను విశాఖపట్నం నుంచి కొనసాగించాలని ఓవైపు ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తుంటే.. మరోవైపు ‘గో బ్యాక్ సీఎం సార్’, ‘రాజధాని అమరావతిని నిర్మించండి' అంటూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. దీంతో విశాఖపట్నంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ‘జన జాగరణ సమితి’ పేరుతో ఈ ఫ్లెక్సీలను గురువారం తెల్లవారుజామున ఆంధ్ర విశ్వవిద్యాలయంతో పాటు పలు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేశారు.
పోస్టర్లను తొలగించిన వైసీపీ నాయకులు: ఈ క్రమంలో జగదాంబ, మద్దిలపాలెం, సిరిపురం, ఆశిల్‌మెట్ట కూడళ్లలో పోస్టర్లు వెలిశాయని విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు.. వాటిని తొలగించేశారు. ఈ నేపథ్యంలో విశాఖ నుంచి త్వరలో పరిపాలన కొనసాగిస్తామన్న ప్రభుత్వ నిర్ణయానికి.. వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లు నగరంలో వెలియడంతో విశాఖ నివాసుల్లో ఆందోళన మొదలైంది. ‘జన జాగరణ సమితి’ పేరుతో ఈ ఫ్లెక్సీలు వెలియడంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ నుంచే పాలన మొదలుపెడతామని సీఎం జగన్ ప్రకటించిన తర్వాత అందుకు విరుద్ధంగా పోస్టర్లు వెలియడంతో వైసీపీ నేతలు మండిపడ్డారు.
పోలీసులకు ఏయూ అధికారులు ఫిర్యాదు: మరోవైపు ఆంధ్ర యూనివర్సిటీలో ప్రశాంతతకు భంగం కలిగించేలా పోస్టర్లను ఏర్పాటు చేయటంపై యూనివర్సిటీ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పోస్టర్లను ఏర్పాటు చేసిన వారిపై, దీని వెనుక ఉన్నవారిని వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ.. మూడవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏయూ అధికారులు ఫిర్యాదు చేశారు. అనంతరం పలువురు వైసీపీ నాయకులు సైతం ఆ పోస్టర్లు ఎవరు వేశారో..? ఏ సమయంలో వేశారో? సీసీ కెమెరాల ఆధారంగా తెలుసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఏయూ అధికారుల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. విశాఖలో పోస్టర్లు వెలియడానికి కారణం ఏమిటి? దీని వెనుక ఎవరు ఉన్నారు? అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేసినట్లు సమాచారం.
ఇవీ చదవండి